
Drishti: వచ్చే ఏడాది భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఉపగ్రహం 'దృష్టి' ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
దేశ ప్రైవేట్ అంతరిక్ష రంగం కొత్త మైలురాయిని దాటేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరుకు చెందిన స్పేస్-టెక్ స్టార్టప్ గెలాక్స్ఐ (GalaxEye) దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కమర్షియల్ ఉపగ్రహం 'దృష్టి'ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగం 2026 తొలి త్రైమాసికంలో జరగనుంది. దాదాపు 160 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని స్పేస్-X మిషన్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. దీంతో భారత్ ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమలో కొత్త దశ ప్రారంభమవనుందని నిపుణులు చెబుతున్నారు.
సాంకేతిక పురోగతి
గెలాక్స్ఐ ప్రత్యేక ఇమేజింగ్ టెక్నాలజీతో 'దృష్టి'
'దృష్టి' ఉపగ్రహంలో గెలాక్స్ఐ అభివృద్ధి చేసిన ప్రత్యేక సింక్‌ఫ్యూజ్డ్ ఆప్టోSAR (SyncFused OptoSAR) టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఇందులో ఆప్టికల్, సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) డేటాను ఒకే ప్లాట్‌ఫారమ్‌లో కలిపి ఉపయోగిస్తారు. ప్రపంచంలో తొలిసారిగా ఇలాంటి సాంకేతికతను వినియోగించడం ఇదే కావడం విశేషం. ఈ ఉపగ్రహం ద్వారా సరిహద్దు పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, రక్షణ అవసరాలు, మౌలిక సదుపాయాల పర్యవేక్షణ వంటి అనేక రంగాల్లో ఆధునిక జియోస్పేషియల్ విశ్లేషణలు చేయగలమని సంస్థ వెల్లడించింది.
ఉపగ్రహ లక్షణాలు
ప్రతి 7-10 రోజులకు భూమి చుట్టూ పునర్వీక్షణ
సుమారు ఒక ఘన మీటరు పరిమాణంలో ఉండే ఈ ఉపగ్రహంలో 3.5 మీటర్ల యాంటెన్నాను అమర్చనున్నారు. ఇది 1.5 మీటర్ల రిజల్యూషన్‌తో చిత్రాలను అందించగలదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 7 నుంచి 10 రోజులకోసారి అదే ప్రాంతాన్ని తిరిగి చిత్రీకరించే సామర్థ్యం కూడా దీనికి ఉంటుంది. గెలాక్స్ఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సుయష్ సింగ్ మాట్లాడుతూ, "మల్టీ సెన్సార్ ఫ్యూజన్ ద్వారా ఈ రిజల్యూషన్ సాధించడం వల్ల అనేక రంగాల్లో కొత్త వినియోగాలను తెరపైకి తెస్తుంది" అని తెలిపారు.
పరీక్ష దశ
విస్తృత పరీక్షలు, ప్రభుత్వ భాగస్వామ్యాలపై చర్చలు
గెలాక్స్ఐ ఇప్పటివరకు సుమారు 500 వాయు పరీక్షలు నిర్వహించింది. వీటిలో డ్రోన్లు, సెస్నా విమానాలు, అధిక ఎత్తు వేదికలను ఉపయోగించారు. అలాగే ఈ సంస్థ ఇస్రో (ISRO) PSLV ద్వారా POEM మిషన్ కింద ఒక పేలోడ్‌ను కూడా ప్రయోగించింది. ప్రస్తుతం రక్షణ, వ్యవసాయం తదితర మంత్రిత్వ శాఖలతో భాగస్వామ్యాలపై చర్చలు కొనసాగుతున్నాయని సంస్థ సీఈఓ సుయష్ సింగ్ తెలిపారు . దృష్టి' ప్రయోగం విజయవంతమైతే, భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఇది గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.