Power Banks In Flight: విమానంలో పవర్ బ్యాంక్‌లు ఎందుకు ప్రమాదకరం? ప్రయాణికులు తెలుసుకోవాల్సిన విషయాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం 6E 6115లో ఆదివారం (అక్టోబర్ 11) ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలోని ఓవర్‌హెడ్ లగేజీ కంపార్ట్‌మెంట్ నుంచి పొగ రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. అది పవర్ బ్యాంక్ నుంచి వస్తున్నట్లు తేలింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానంలో అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులను చెన్నైకి తీసుకెళ్లేందుకు ఇండిగో మరో విమానాన్ని ఏర్పాటు చేసింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
వివరాలు
పవర్ బ్యాంక్‌లలో మంటలు ఎందుకు వస్తాయి?
పవర్ బ్యాంక్‌లలో సాధారణంగా లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తారు.
ఇవి తక్కువ పరిమాణంలో ఎక్కువ శక్తిని నిల్వ చేయగలవు. అయితే బ్యాటరీ అతిగా వేడెక్కినప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది.
దీనిని 'థర్మల్ రన్‌అవే' అంటారు. బ్యాటరీ విపరీతంగా వేడెక్కినప్పుడు దానిలో రసాయన చర్యలు వేగంగా జరిగి, మరింత వేడి పుడుతుంది.
ఫలితంగా పొగ,విష వాయువులు వెలువడవచ్చు. మంటలు ఆర్పిన తర్వాత కూడా బ్యాటరీ మళ్లీ మండే ప్రమాదం ఉంటుంది.
నాణ్యత లేని బ్యాటరీలు, తయారీలో లోపాలు, అంతర్గత భాగాలకు రక్షణ లేకపోవడం, బ్యాటరీ దెబ్బతినడం, షార్ట్ సర్క్యూట్, అధిక వేడి, సరిగా ఛార్జింగ్ చేయకపోవడం వంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతాయి.
విమానంలో ఇలాంటి ఘటనలు మరింత ప్రమాదకరం.
వివరాలు
గతంలోనూ ఇలాంటి ఘటనలు
మూసివున్న క్యాబిన్‌లో పొగ వేగంగా వ్యాపించి ప్రయాణికులు, సిబ్బందికి ఇబ్బంది కలిగించవచ్చు.
ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంట్‌లో మంటలు వస్తే వాటి మూలాన్ని గుర్తించడం,వెంటనే చేరుకోవడం కష్టమవుతుంది.
లోపల ఇతరుల బ్యాగులు ఉండటంతో నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.
2024 జూన్‌లో అబుదాబి నుంచి కోజికోడ్ వెళ్లాల్సిన ఎయిర్ అరేబియా విమానంలో పవర్ బ్యాంక్ పేలడంతో మంటలు చెలరేగాయి.
2025 మార్చిలో దక్షిణ కొరియా విమానంలోనూ పవర్ బ్యాంక్‌కు సంబంధించిన అగ్నిప్రమాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి.
అదే ఏడాది జులైలో ఆస్ట్రేలియాలో విమానం ల్యాండింగ్‌కు ముందు ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో మంటలు చెలరేగాయి. అనంతరం అందులో కాలిపోయిన పవర్ బ్యాంక్‌ను గుర్తించారు.
బ్యాటరీలో థర్మల్ రన్‌అవే కారణంగా ఈ ఘటన జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
వివరాలు
పవర్ బ్యాంక్‌లో మంటలు వస్తే ఏం చేయాలి?
2026 అక్టోబర్‌లో జరిగిన తాజా ఇండిగో ఘటన మరోసారి విమాన భద్రతపై ఆందోళన పెంచింది.
పవర్ బ్యాంక్ అసాధారణంగా వేడెక్కినా,ఉబ్బినా,వింత వాసన వచ్చినా లేదా పొగ వచ్చినా వెంటనే విమాన సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.
ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంట్‌లో పొగ వస్తుంటే దాన్ని తెరిచి పరికరాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించకూడదు.
మంటలు కనిపించకపోయినా ప్రమాదం పూర్తిగా తొలగిపోయిందని భావించకూడదు.
పవర్ బ్యాంక్‌లను చెక్-ఇన్ బ్యాగేజీలో కాకుండా క్యాబిన్ బ్యాగేజీలోనే తీసుకెళ్లాలి.
బోర్డింగ్ గేట్ వద్ద క్యాబిన్ బ్యాగ్‌ను కార్గోలోకి పంపాల్సి వస్తే,అందులోని పవర్ బ్యాంక్‌ను తీసి తమతో ఉంచుకోవాలి.
విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్‌ల వినియోగం, వాటిని భద్రపరిచే విధానంపై డీజీసీఏ జారీ చేసిన సూచనలు, విమానయాన సంస్థ నిబంధనలను ప్రయాణికులు తప్పనిసరిగా పాటించాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌తో కలకలం
WATCH: Powerbank fire breaks out in the overhead luggage compartment on an IndiGo flight on Sunday. The aircraft was diverted to Hyderabad, where it landed safely. pic.twitter.com/G9JevuFVPp
— Breaking Aviation News & Videos (@aviationbrk) October 11, 2026