LOADING...
IRCTC down : దీపావళి ముందు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్,యాప్ క్రాష్.. ప్రయాణికుల ఆందోళన
దీపావళి ముందు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్,యాప్ క్రాష్.. ప్రయాణికుల ఆందోళన

IRCTC down : దీపావళి ముందు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్,యాప్ క్రాష్.. ప్రయాణికుల ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2025
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

దీపావళి సమీపిస్తున్న వేళ భారతీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ అక్టోబర్‌ 17న ఆకస్మికంగా పనిచేయడం ఆగిపోయింది. సర్వర్‌ డౌన్‌ కావడంతో సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు రైలు టిక్కెట్లు బుక్‌ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పండుగ సెలవుల కోసం స్వస్థలాలకు వెళ్లేందుకు, చివరి నిమిషంలో టిక్కెట్లు రిజర్వ్‌ చేసుకోవాలనుకున్న వారికి ఈ సాంకేతిక సమస్య తీవ్ర ఇబ్బందిని కలిగించింది.

వివరాలు 

బుకింగ్‌లు నిలిపివేత, తాత్కాలిక సేవల రద్దు 

IRCTC తన వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ప్రకటనలో, "దాదాపు ఒక గంట పాటు అన్ని రకాల టిక్కెట్‌ బుకింగ్‌లు, రద్దు సేవలు అందుబాటులో ఉండవు" అని తెలిపింది. టిక్కెట్‌లు రద్దు చేయాలనుకునే వారు లేదా TDR (టికెట్‌ డిపాజిట్‌ రసీదు) సమర్పించాల్సిన వినియోగదారులు 08044647999 లేదా 08035734999 నంబర్లకు కాల్‌ చేయవచ్చు లేదా etickets@irctc.co.in కు ఇమెయిల్‌ పంపవచ్చని సూచించారు. ఈ లోపం పండుగ సీజన్‌ ముందురోజులలోనే చోటుచేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. వెబ్‌సైట్‌, IRCTC రైల్‌ కనెక్ట్‌ యాప్‌లో లాగిన్‌ అవ్వలేకపోతున్నామంటూ, చెల్లింపులు పూర్తవడం లేదంటూ అనేక మంది సోషల్‌ మీడియాలో ఫిర్యాదులు చేశారు.

వివరాలు 

తత్కాల్‌ బుకింగ్‌ టైమ్‌లోనే సర్వర్‌ డౌన్‌ 

సాధారణంగా IRCTC తత్కాల్‌ బుకింగ్‌ విండో.. ఏసీ కోచ్‌లకు ఉదయం 10గంటలకు,స్లీపర్‌ క్లాస్‌ టిక్కెట్లకు ఉదయం 11 గంటలకు తెరుచుకుంటుంది. అయితే శుక్రవారం ఉదయం 10:40గంటల సమయంలోనే సిస్టమ్‌ నిలిచిపోయింది. తత్కాల్‌ బుకింగ్‌లు ప్రారంభం కావడానికి క్షణాల ముందు సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది వినియోగదారులు టిక్కెట్లు బుక్‌ చేసుకోలేకపోయారు. వెబ్‌పేజీపై ఎర్రర్‌ మెసేజ్‌లు మాత్రమే కనిపించాయి. పండుగ ముందు టిక్కెట్‌లకు భారీ డిమాండ్ దీపావళి సమీపంలో రైలు టిక్కెట్లకు డిమాండ్‌ ఎప్పటిలా అధికంగా ఉంది. బస్సులు,విమానాల కంటే రైలు ప్రయాణమే సౌకర్యవంతమని భావించే చాలా మంది ఈ సారి సాంకేతిక సమస్యలతో నిరాశ చెందారు. సర్వర్‌ క్రాష్‌ కావడంతో బుకింగ్‌ సమయానికి టిక్కెట్లు పొందలేకపోవడం వారికి తీవ్ర అసౌకర్యం కలిగించింది.

వివరాలు 

ఐఆర్‌సీటీసీ షేర్‌ ధరలపై ప్రభావం 

వెబ్‌సైట్‌,యాప్‌ తాత్కాలికంగా నిలిచిపోవడంతో IRCTC షేర్లు కూడా స్వల్పంగా పడిపోయాయి. శుక్రవారం ఉదయం 11:10 గంటలకు కంపెనీ స్టాక్‌ BSEలో 0.28శాతం తగ్గి రూ.717.05వద్ద ట్రేడ్‌ అయింది. గత వారం రోజుల్లో 0.34 శాతం లాభం నమోదు చేసినా, గత రెండు వారాల్లో మాత్రం 1.44శాతం పెరుగుదల కనిపించింది. గత ఆరు నెలల్లో కంపెనీ షేర్‌ ధర 6.74 శాతం మేర తగ్గగా,ఏడాది వ్యవధిలో మొత్తం 17.69 శాతం క్షీణించింది. ప్రస్తుతం IRCTC మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ విలువ సుమారు రూ.57,400 కోట్లుగా ఉంది. కంపెనీ సాంకేతిక లోపాన్ని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు ప్రారంభించిందని,సేవలను త్వరలో పునరుద్ధరిస్తామని IRCTC బృందం ప్రకటించింది. వినియోగదారులకు కలిగిన అసౌకర్యంపై క్షమాపణలు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.