ISRO: ఇస్రో సత్తా.. GSLV F-17 ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి EOS-05
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని నమోదు చేసింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన GSLV F-17 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోట నుంచి శుక్రవారం తెల్లవారుజామున నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F17 రాకెట్.. 2,367 కిలోల బరువున్న అత్యాధునిక EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. GSLV F-17 వాహకనౌక ద్వారా Advanced Earth Observation Satellite-05 (EOS-05)ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ వెల్లడించారు. ఈ ఉపగ్రహాన్ని తొలుత 170 కి.మీ x 29,000కి.మీ కక్ష్యలోకి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అయితే రాకెట్ అంచనాలకు మించి మెరుగైన పనితీరు కనబరచడంతో.. 171కి.మీ x 31,026 కి.మీ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
వివరాలు
ఈ ఏడాది ఇదే తొలి ప్రయోగం
దేశ అవసరాల కోసం భూమిని అత్యంత నిశితంగా పరిశీలించేందుకు ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించనున్నట్లు నారాయణన్ తెలిపారు.
36,000 కి.మీ జియోసింక్రనస్ ప్లాట్‌ఫారమ్‌లో ఉంచుతున్న తొలి ఉపగ్రహం ఇదేనని పేర్కొన్నారు.
దీంతో EOS-05 మిషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో శ్రీహరికోట నుంచి జరిగిన రెండో విజయవంతమైన ప్రయోగం ఇది.
తొలి ప్రయోగం స్కైరూట్ స్టార్టప్‌కు సంబంధించినది కాగా.. ఇస్రోకు మాత్రం ఈ ఏడాది ఇదే తొలి ప్రయోగం.
ఈ ఏడాది కమ్యూనికేషన్ ఉపగ్రహాలతో పాటు గగన్‌యాన్ కార్యక్రమానికి సంబంధించిన రెండు మానవరహిత ప్రయోగాలు సహా మొత్తం ఆరు ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణన్ వెల్లడించారు.
వివరాలు
నిరంతర నిఘాకు కీలకం..
భారత ఉపఖండంపై నిరంతరం నిఘా ఉంచే అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహంగా EOS-05 మిషన్ కీలకంగా మారనుంది.
ఈ ఉపగ్రహం సాధారణ పరిస్థితుల్లో ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కొత్త చిత్రాలను అందించగలదు.
ప్రత్యేక పరిస్థితుల్లో కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే తాజా చిత్రాలను అందించే సామర్థ్యం దీనికి ఉంది.
తుఫానులు, వరదలు, కార్చిచ్చులు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించడంలో ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.
అలాగే వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షించేందుకు దోహదం చేస్తుంది.
దేశ సరిహద్దులపై రియల్‌టైమ్ వ్యూహాత్మక నిఘా నిర్వహించడంతో పాటు.. వాతావరణ పరిస్థితులను కచ్చితత్వంతో ఎప్పటికప్పుడు గమనించడంలో EOS-05 కీలక పాత్ర పోషించనుందని ఇస్రో తెలిపింది.