ISRO Calendar: 2026 ఇస్రోకు టర్నింగ్ పాయింట్.. గగన్‌యాన్ సహా కీలక మిషన్లకు రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. 2025లో అనేక ముఖ్యమైన ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో, వచ్చే ఏడాది అయిన 2026లో మరిన్ని కీలక మిషన్లను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చేపట్టే ప్రాజెక్టులు భారత్ అంతరిక్ష రంగ భవిష్యత్తును కొత్త దిశగా తీసుకెళ్లనున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత అంతరిక్ష ప్రయాణానికి కీలక మలుపు 2025 ముగింపు దశకు చేరుకున్న వేళ, ఇస్రో పూర్తిగా 2026పై దృష్టి సారించింది. వచ్చే ఏడాది జరగనున్న ప్రయోగాల విజయం భవిష్యత్ మానవ అంతరిక్ష యాత్రలకు బలమైన పునాది వేయనుందని అంచనా. అందుకే 2026ను ఇస్రో అత్యంత ప్రాధాన్య సంవత్సరంగా పరిగణిస్తోంది.
వివరాలు
వ్యోమమిత్రతో అన్‌క్రూడ్ గగన్‌యాన్ ప్రయోగం
2026లో ఇస్రో చేపట్టనున్న ప్రధాన ప్రయోగాల్లో అన్‌క్రూడ్ గగన్‌యాన్ మిషన్ ఒకటి.
ఈ ప్రయోగంలో 'వ్యోమమిత్ర' అనే హ్యూమనాయిడ్ రోబోట్‌ను అంతరిక్షంలోకి పంపనున్నారు.
ఇది భారత్ తొలి మానవ అంతరిక్ష ప్రయాణానికి ముందు నిర్వహించే కీలక పరీక్ష.
2027లో ముగ్గురు వ్యోమగాములను కక్ష్యలోకి పంపే లక్ష్యంతో ఇస్రో పని చేస్తోంది.
అంతకుముందు ప్రయాణ భద్రత, వ్యవస్థల పనితీరును వ్యోమమిత్ర ద్వారా పూర్తిగా పరిశీలించనుంది.
వివరాలు
HAL-L&T తయారు చేసిన PSLV తొలి వాణిజ్య ప్రయోగం
2026లో మరో ముఖ్యమైన ఘట్టంగా PSLV తొలి వాణిజ్య ప్రయోగం జరగనుంది. ISRO డిజైన్ ఆధారంగా HAL, L&T సంస్థలు ఈ రాకెట్‌ను తయారు చేశాయి.
2026 తొలి త్రైమాసికంలో Oceansat-3A ఉపగ్రహంతో ఈ PSLV ప్రయోగం జరగే అవకాశం ఉంది.
భూమి, సముద్రాల పరిశీలన కోసం రూపొందించిన ఈ ఉపగ్రహం వాతావరణ అధ్యయనం, మత్స్యకార రంగానికి ఉపయోగపడనుంది.
వివరాలు
క్వాంటం-కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ పరీక్ష
డేటా భద్రత రంగంలో కీలక ముందడుగుగా 2026లో ISRO కొత్త టెక్నాలజీని పరీక్షించనుంది.
PSLV రాకెట్ ద్వారా DDS-1 అనే టెక్నాలజీ డెమో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు.
ఇందులో క్వాంటం-కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీని వినియోగించనున్నారు.
సాధారణ ఎన్‌క్రిప్షన్ విధానాల కంటే ఇది మరింత భద్రమైన సాంకేతికతగా భావిస్తున్నారు. అంతరిక్షంలో ఈ టెక్నాలజీని పరీక్షించడం భారత్‌కు ఇదే తొలిసారి.
వివరాలు
ఇండియా-మారిషస్ సంయుక్త ఉపగ్రహం,విక్రమ్-1 రాకెట్
2026లో ఇండియా-మారిషస్ సంయుక్త ఉపగ్రహ మిషన్ కూడా ప్రయోగానికి సిద్ధంగా ఉంది.
చిన్న ఇమేజింగ్ ఉపగ్రహాన్ని PSLV రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు.
మరోవైపు, స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ప్రైవేట్ రాకెట్ 'విక్రమ్-1' కూడా అదే ఏడాది ప్రయోగానికి సిద్ధమవుతోంది.
ఇది విజయవంతమైతే, భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఒక పెద్ద మైలురాయిగా నిలవనుంది.