ISRO: 2028 నాటికి భారత అంతరిక్ష కేంద్రం ప్రారంభం: ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. భారతీయ విజ్ఞాన సమ్మేళన్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మరో ఐదేళ్లలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) మొదటి మాడ్యూల్‌ను ప్రారంభిస్తామని సోమనాథ్ పేర్కొన్నారు. మొదటి మాడ్యూల్ ఎనిమిది టన్నుల బరువు, రోబోటిక్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. ఇస్రోకు చెందిన ఈ అంతరిక్ష కేంద్రం 2035 నాటికి పూర్తి స్థాయిలో పనిచేస్తుందని సోమ్‌నాథ్ చెప్పారు.
కొత్త రాకెట్ అభివృద్ధిపై ఇస్రో కసరత్తు
ప్రస్తుతం భారత్‌లో ఉన్న రాకెట్ కేవలం 10 టన్నుల బరువును మాత్రమే మోసుకెళ్లగలదని, 20 టన్నుల నుంచి 1,215 టన్నుల బరువును మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న కొత్త రాకెట్‌పై ఇస్రో కసరత్తు చేస్తోందని సోమనాథ్ వెల్లడించారు. 2035 నాటికి ISS మిషన్‌లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ప్రణాళికలతో అంతరిక్ష కేంద్రం పని చేస్తుందని పేర్కొన్నారు. ఆదిత్య ఎల్-1 సోలార్ మిషన్ గురించి సోమనాథ్ మాట్లాడుతూ.. జనవరి 6న ఆదిత్య ఎల్-1 పాయింట్‌కి చేరుకుంటుందన్నారు. లాగ్రాంజ్ పాయింట్ 1 (L-1) భూమికి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది.