Japan: పునర్వినియోగ రాకెట్ పరీక్షలో జపాన్‌కు తొలి విజయం
ఈ వార్తాకథనం ఏంటి
పునర్వినియోగ రాకెట్ల అభివృద్ధిలో ఆసియా దేశాల మధ్య పోటీ మరింత వేగం అందుకుంది. ఇటీవల చైనా ఈ రంగంలో విజయవంతమైన ప్రయోగం నిర్వహించిన కొద్ది గంటల వ్యవధిలోనే జపాన్ కూడా తన తొలి పునర్వినియోగ రాకెట్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. భవిష్యత్‌లో అంతరిక్ష ప్రయోగాల వ్యయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, ప్రస్తుతం ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న స్పేస్‌ఎక్స్‌కు పోటీగా నిలవాలనే లక్ష్యంతో జపాన్ ఈ సాంకేతికతపై దృష్టి సారిస్తోంది. జపాన్ అభివృద్ధి చేసిన ఆర్‌వీ-ఎక్స్ (RV-X) పునర్వినియోగ రాకెట్ శనివారం నిర్వహించిన పరీక్షలో సుమారు ఒక నిమిషం పాటు గాల్లోకి ఎగిరింది.
వివరాలు
నిర్దేశిత ప్రాంతంలో విజయవంతంగా ల్యాండింగ్..
అనంతరం స్వల్ప దూరం అడ్డంగా కదిలి, నిర్దేశిత ప్రాంతంలో విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. ఈ ప్రయోగాన్ని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)కు చెందిన నోషిరో టెస్టింగ్ సెంటర్‌లో నిర్వహించగా, ఎన్‌వీఎస్ సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఇప్పటి వరకు జపాన్ ప్రధానంగా ఒక్కసారి మాత్రమే వినియోగించగలిగే హెచ్-3 (H3) శ్రేణి రాకెట్ల ద్వారానే అంతరిక్ష ప్రయోగాలు చేపడుతోంది. ఇవి అంతకుముందు ఉపయోగించిన హెచ్2ఏ (H2A) రాకెట్లతో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్నప్పటికీ, అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల మార్కెట్‌లో సమర్థంగా పోటీ పడాలంటే ప్రయోగ వ్యయాన్ని మరింత తగ్గించడం అవసరమని జపాన్ భావిస్తోంది.
వివరాలు
అత్యాధునిక ఇంజిన్ల వినియోగం..
ఈ లక్ష్య సాధనతో పాటు జాతీయ భద్రత పరంగా కూడా పునర్వినియోగ రాకెట్ సాంకేతికత కీలకమని అక్కడి ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జాక్సా (JAXA), మిత్సుబుషి హెవీ ఇండస్ట్రీస్ సంయుక్తంగా రూపొందించిన ఆర్‌వీ-ఎక్స్ రాకెట్ సుమారు 23.9 అడుగుల ఎత్తు, ఆరు అడుగుల వ్యాసం కలిగి ఉంది. ఇందులో అత్యాధునిక ఇంజిన్లతో పాటు, సురక్షిత ల్యాండింగ్ కోసం నాలుగు షాక్ అబ్జార్బర్లతో కూడిన ప్రత్యేక ల్యాండింగ్ గేర్‌ను అమర్చారు. పునర్వినియోగ రాకెట్ సాంకేతికత అభివృద్ధి కోసం జాక్సా ఫ్రాన్స్, జర్మనీ దేశాల సహకారాన్ని కూడా పొందుతోంది.