LOADING...
JetZero: 70 ఏళ్ల విమాన డిజైన్‌కు గుడ్‌బై.. జెట్‌జీరో కొత్త ప్రయోగం!
70 ఏళ్ల విమాన డిజైన్‌కు గుడ్‌బై.. జెట్‌జీరో కొత్త ప్రయోగం!

JetZero: 70 ఏళ్ల విమాన డిజైన్‌కు గుడ్‌బై.. జెట్‌జీరో కొత్త ప్రయోగం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత ఏడు దశాబ్దాలుగా ప్రపంచం చూసిన ప్రయాణికుల విమానాల రూపకల్పన దాదాపు ఒకే విధంగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆ సంప్రదాయానికి ముగింపు పలకాలని అమెరికాకు చెందిన స్టార్టప్ సంస్థ జెట్‌జీరో (JetZero) ప్రయత్నిస్తోంది. విమానాల రూపాన్ని పూర్తిగా మార్చడంతో పాటు ఇంధన వినియోగాన్ని భారీగా తగ్గించే లక్ష్యంతో రూపొందిస్తున్న కొత్త డిజైన్ ప్రపంచ విమానయాన రంగం దృష్టిని ఆకర్షిస్తోంది. బోయింగ్, ఎయిర్‌బస్ వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ అభివృద్ధిని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

వివరాలు 

బోయింగ్, ఎయిర్‌బస్ ఆధిపత్యానికి సవాల్

దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్య విమానాల మార్కెట్‌లో బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న చాలా పెద్ద ప్రయాణికుల విమానాలు ఈ రెండు సంస్థల రూపకల్పనే. అయితే కాలిఫోర్నియాకు చెందిన జెట్‌జీరో సంప్రదాయ నమూనాలకు భిన్నంగా కొత్త తరహా విమానాన్ని అభివృద్ధి చేస్తూ ఈ రంగంలో కొత్త పోటీకి తెరలేపింది. రెక్కలు, శరీరం వేర్వేరు కాదు.. ఒకే నిర్మాణం జెట్‌జీరో ప్రస్తుతం అమెరికాలోని మొహావే ఎడారిలో పూర్తి స్థాయి డెమోన్స్ట్రేటర్ విమానాన్ని నిర్మిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న విమానాల్లో ఫ్యూజలేజ్‌, రెక్కలు విడివిడిగా ఉండగా, జెట్‌జీరో రూపొందిస్తున్న విమానంలో అవి రెండూ కలిసిపోయి ఒకే నిర్మాణంగా ఉంటాయి.

వివరాలు 

ఇంధన ఖర్చులో 50 శాతం వరకు తగ్గింపు

ఈ ప్రత్యేక నమూనాను బ్లెండెడ్ వింగ్ బాడీ(Blended Wing Body)డిజైన్‌గా పిలుస్తారు. దీని ఆకారం సముద్ర జీవి మంతా రే చేపను పోలి ఉంటుంది. విమానయాన సంస్థలకు అత్యధిక వ్యయం ఇంధనంపైనే ఉంటుంది. జెట్‌జీరో రూపొందిస్తున్న విమానం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాధారణ జెట్‌లతో పోలిస్తే దాదాపు 50శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేయగలదని కంపెనీ చెబుతోంది. విమానం ఆకారం వల్ల గాలిలో ప్రయాణించే సమయంలో ఎదురయ్యే నిరోధం(డ్రాగ్) తగ్గిపోవడంతో ఇంధన వినియోగం గణనీయంగా తగ్గుతుందని సంస్థ వివరిస్తోంది. అదేవిధంగా ఇంజిన్లను విమానం వెనుక భాగంలో అమర్చడం వల్ల నేలపై వినిపించే శబ్దం కూడా తగ్గుతుంది. ఇంధన వినియోగం తగ్గడం ద్వారా కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని కంపెనీ పేర్కొంటోంది.

Advertisement

వివరాలు 

ప్రయాణికులకు మరింత సౌకర్యం

ఈ విమానం లోపలి భాగం కూడా ప్రస్తుతం ఉన్న విమానాల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సన్నని గొట్టం ఆకారంలో ఉండే కేబిన్‌కు బదులుగా విశాలమైన, చదునైన ప్రయాణికుల విభాగాన్ని రూపొందిస్తున్నారు. దీని వల్ల పెద్ద కిటికీలు ఏర్పాటు చేయడంతో పాటు సీట్ల అమరికను మరింత సౌకర్యవంతంగా మార్చే అవకాశం ఉంటుంది. గ్యాలీలు, మరుగుదొడ్లను కూడా అవసరానికి అనుగుణంగా రూపొందించవచ్చు. మొత్తం మీద ప్రయాణికులకు ఎక్కువ స్థలం, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవం లభిస్తుంది.

Advertisement

వివరాలు 

200 నుంచి 270 మంది ప్రయాణికుల సామర్థ్యం

జెట్‌జీరో అభివృద్ధి చేస్తున్న Z4 విమానం ఒకేసారి 200 నుంచి 270 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలా రూపకల్పన చేశారు. గతంలో ఈ విభాగంలో బోయింగ్ 757, 767 విమానాలు కీలక పాత్ర పోషించగా, ఇప్పుడు అదే మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని జెట్‌జీరో ముందుకు సాగుతోంది. నాసా పరిశోధనలకు కొనసాగింపే బ్లెండెడ్ వింగ్ బాడీ సాంకేతికత కొత్త ఆలోచన కాదు. గత మూడు దశాబ్దాలుగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) ఈ సాంకేతికతపై పరిశోధనలు నిర్వహిస్తోంది. అయితే పూర్తి స్థాయి వాణిజ్య విమానంగా దీన్ని అభివృద్ధి చేసే దశకు ఇప్పటి వరకు ఏ సంస్థా చేరుకోలేదు.

వివరాలు 

అమెరికా వైమానిక దళం నుంచి భారీ మద్దతు

జెట్‌జీరో సీఈఓ టామ్ ఓ'లీరీ మాట్లాడుతూ.. కొత్త సాంకేతికతను కనిపెట్టడం తమ లక్ష్యం కాదని, ఇప్పటికే పరీక్షల్లో నిరూపితమైన సాంకేతికతను వాణిజ్య విమానంగా మార్చడమే తమ ఉద్దేశమని తెలిపారు. జెట్‌జీరో ప్రాజెక్టుకు 2023లో అమెరికా వైమానిక దళం 235 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ నిధులతో పూర్తి స్థాయి డెమోన్స్ట్రేటర్ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అలస్కా ఎయిర్‌లైన్స్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు కూడా కంపెనీలో పెట్టుబడులు పెట్టడంతో ఈ ప్రాజెక్టుపై ప్రపంచ విమానయాన రంగం ఆసక్తి మరింత పెరిగింది.

వివరాలు 

2030 నాటికి వాణిజ్య విమానాల తయారీ లక్ష్యం

జెట్‌జీరో ప్రణాళిక ప్రకారం 2027 నాటికి డెమోన్స్ట్రేటర్ విమానం తొలి పరీక్ష పూర్తికావాలి. అనంతరం వరుస పరీక్షలు విజయవంతమైతే మరిన్ని పెట్టుబడులు సమీకరించి, 2030 నాటికి వాణిజ్య విమానాల తయారీ ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే డిజైన్‌ను భవిష్యత్తులో సైనిక రవాణా విమానాలు, గగనతలంలో ఇంధనం నింపే విమానాలుగా కూడా వినియోగించే అవకాశాలను పరిశీలిస్తోంది.

వివరాలు 

ముందున్న సవాళ్లు తక్కువ కావు

అయితే ఈ ప్రయాణం అంత సులభం కాదు. కొత్త డిజైన్ ప్రకటించిన స్థాయిలో నిజంగానే ఇంధనాన్ని ఆదా చేస్తుందా? భద్రతా ప్రమాణాలను ఎలా నిరూపిస్తుంది? ప్రపంచ విమానయాన నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు ఎలా పొందుతుంది? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. దీనికోసం బిలియన్ల డాలర్ల పెట్టుబడితో పాటు అనేక సంవత్సరాల పరీక్షలు అవసరమవుతాయి. విమానయాన రంగ విశ్లేషకుడు రిచర్డ్ అబౌలాఫియా అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రాజెక్టు ఇప్పుడే విజయవంతమైందని చెప్పలేం. అదే సమయంలో ఇది అసాధ్యమని కూడా చెప్పడానికి అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.

వివరాలు 

భవిష్యత్‌ విమానాలకు కొత్త దిశ

దాదాపు 70 ఏళ్లుగా పెద్దగా మారని విమానాల రూపకల్పనలో జెట్‌జీరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో ప్రయాణికుల విమానాల ఆకారం మాత్రమే కాదు.. ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాలు, ప్రయాణికుల సౌకర్యం వంటి అంశాల్లో కూడా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సాంకేతిక, ఆర్థిక, నియంత్రణ పరమైన కీలక సవాళ్లను ఈ స్టార్టప్ విజయవంతంగా అధిగమించాల్సి ఉంటుంది.

Advertisement