Jio AI Call Agent: ఇక 'హే జియో'అంటే చాలు.. కాల్‌లోకి ఏఐ ఎంట్రీ.. జియో AGMలో భారీ ప్రకటనలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి ఏడాది కొత్త టెక్నాలజీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న రిలయన్స్ జియో.. ఈసారి వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్దపీట వేసింది. సాధారణ ప్రజలకు ఏఐ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో జియో పలు కొత్త ఉత్పత్తులు, సేవలను ప్రకటించింది. ఇందులో జియో కాల్ ఏఐ ఏజెంట్, మై జియో యాప్‌ను ఏఐ ఆధారిత వ్యక్తిగత సహాయకుడిగా తీర్చిదిద్దడం, అలాగే జియో టెలిఫ్రేమ్ అనే కొత్త పరికరాన్ని పరిచయం చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జియో ప్లాట్‌ఫామ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ఈ కీలక ప్రకటనలు చేశారు.
వివరాలు
'హే జియో' అంటే చాలు.. కాల్‌లోకి ఏఐ
జియో తన నెట్‌వర్క్‌లో ప్రత్యేక ఏఐ కాల్ ఏజెంట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం వినియోగదారులు ఎలాంటి అదనపు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫోన్ కాల్ మాట్లాడుతున్న సమయంలో 'హే జియో' అని పిలిస్తే ఈ ఏఐ కాల్ ఏజెంట్ యాక్టివేట్ అవుతుంది. వినియోగదారు అనుమతితో కాల్‌లో చేరి అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. ఒకేసారి 10 మంది పాల్గొనే కాన్ఫరెన్స్ కాల్‌లో కూడా ఎవరు ఏమి మాట్లాడుతున్నారో రియల్‌టైమ్‌లో గుర్తించి స్థానిక భాషలో ట్రాన్స్‌క్రిప్షన్ అందిస్తుంది. కాల్ పూర్తయిన తర్వాత మొత్తం సంభాషణను సంక్షిప్తంగా సమ్మరీ రూపంలో అందిస్తుంది. అంతేకాకుండా వినియోగదారుల తరఫున క్యాబ్ బుక్ చేయడం,ఆహారం ఆర్డర్ చేయడం, రెస్టారెంట్‌లో టేబుల్ రిజర్వ్ చేయడం వంటి పనులను కూడా నిర్వహించగలదు.
వివరాలు
మై జియో యాప్‌కు ఏఐ శక్తి
ఈ ఏడాది చివరి నాటికి జియో వినియోగదారులందరికీ ఈ ఏఐ కాల్ ఏజెంట్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆకాశ్ అంబానీ ప్రకటించారు. ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్,అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడం,జియో సేవలను నిర్వహించేందుకు ఉపయోగిస్తున్న మై జియో యాప్‌లో భారీ మార్పులు తీసుకురానున్నారు. భవిష్యత్తులో ఈ యాప్ వ్యక్తిగత ఏఐ సలహాదారుగా, రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పనిచేయనుంది. వినియోగదారులు వివిధ మెనూలలో వెతకాల్సిన అవసరం లేకుండా తమకు కావాల్సిన సేవను చెప్పగానే ఏఐ అసిస్టెంట్ సంబంధిత పనులను పూర్తి చేస్తుంది. ఉదాహరణకు జియో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను మరో ప్రాంతానికి మార్చాలంటే అవసరమైన ప్రక్రియను స్వయంగా నిర్వహిస్తుంది.
వివరాలు
టెలిఫ్రేమ్.. ఇంట్లోనే ఏఐ సహాయకుడు
విదేశాలకు వెళ్లే వారికి అనువైన అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్‌లను సూచించడం వంటి సేవలను కూడా అందించనుంది. అయితే ఈ ఏఐ ఏజెంట్లు పూర్తిగా వినియోగదారుల అనుమతితోనే పనిచేస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. ఏజీఎం సందర్భంగా జియో 'టెలిఫ్రేమ్' అనే కొత్త పరికరాన్ని కూడా ఆవిష్కరించింది. ఇంట్లో వివిధ రకాల ఏఐ ఏజెంట్లకు ఇది ఒక కేంద్రంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. రోజువారీ అవసరాల్లో వినియోగదారుల తరఫున అనేక పనులను నిర్వహించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఇంట్లోనే ఉండి వినియోగదారుల అవసరాలను గుర్తించి తగిన సూచనలు అందిస్తుంది. డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉంటే ముందుగానే గుర్తు చేస్తుంది. వర్షం పడే అవకాశం ఉంటే గొడుగు తీసుకెళ్లాలని హెచ్చరిస్తుంది.
వివరాలు
ఏఐపై జియో ఫోకస్
క్రీడాభిమానుల కోసం కూడా ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో జియో హాట్‌స్టార్‌ను ప్లే చేయడంతో పాటు ప్రత్యక్ష స్కోరును డిస్‌ప్లేపై చూపించే సదుపాయం ఇందులో ఉండనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సాధారణ ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయాలనే లక్ష్యంతో జియో ఈ కొత్త సేవలను ప్రకటించింది. కాలింగ్, డిజిటల్ సేవలు, ఇంటి అవసరాలు.. ఇలా ఒకే ఎకోసిస్టమ్‌లో ఏఐ ఆధారిత సేవలను అందించేందుకు కంపెనీ అడుగులు వేస్తోంది. జియో కాల్ ఏజెంట్, మై జియో ఏఐ అసిస్టెంట్, టెలిఫ్రేమ్ వంటి ఉత్పత్తులు వినియోగదారుల డిజిటల్ అనుభవాన్ని మరింత సులభతరం చేయనున్నాయి.