LOADING...
VB-GRAM: జులై 1 నుంచి వీబీ-జీ రాంజీ అమలు.. గ్రామాల్లో 318 రకాల అభివృద్ధి పనులు
జులై 1 నుంచి వీబీ-జీ రాంజీ అమలు.. గ్రామాల్లో 318 రకాల అభివృద్ధి పనులు

VB-GRAM: జులై 1 నుంచి వీబీ-జీ రాంజీ అమలు.. గ్రామాల్లో 318 రకాల అభివృద్ధి పనులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రామీణాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ రాంజీ) పథకం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద చేపట్టాల్సిన 318 రకాల పనుల జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం, అవసరమైన నిధులను కూడా కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి, సహజ వనరుల పరిరక్షణ, జీవనోపాధి అవకాశాల పెంపు, విపత్తుల నిర్వహణ లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించింది.

వివరాలు 

జల సంరక్షణ విభాగంలో..

ప్రస్తుతం అమలులో ఉన్న ఉపాధి హామీ పథకంలో సహజ వనరుల నిర్వహణ, వ్యక్తిగత లబ్ధిదారుల పనులు, వ్యవసాయ-అనుబంధ కార్యకలాపాలు, గ్రామీణ మౌలిక సదుపాయాలు అనే నాలుగు విభాగాల్లో 266 పనులు ఉన్నాయి. కొత్త వీబీ-జీ రాంజీ పథకంలో గ్రామీణ మౌలిక సదుపాయాల విభాగాన్ని కొనసాగిస్తూ, మిగిలిన మూడు విభాగాల్లో మార్పులు చేసి మొత్తం 318 పనులను చేర్చారు. నీటి వనరుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ కాలువలు, చెక్‌డ్యామ్‌లు, గల్లీ ప్లగ్‌లు, భూగర్భ డైక్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. వర్షపు నీటి కాలువల మరమ్మతులు, నిర్వహణతో పాటు చెరువులు,ఇంకుడు గుంతలు,రీఛార్జ్ పిట్లు, రీఛార్జ్ షాఫ్టులు,బావులు వంటి నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు లేదా పునరుద్ధరిస్తారు.

వివరాలు 

గ్రామీణ మౌలిక సదుపాయాల విభాగంలో..

సాగునీటి బావులు, సూక్ష్మ సాగునీటి కాలువల మరమ్మతులు, స్ప్రింక్లర్ సాగునీటి వ్యవస్థలు, అటవీకరణ, బంజరు భూముల్లో మొక్కల పెంపకం, భవనాలపై వర్షపు నీటి సంరక్షణ పనులు కూడా ఇందులో భాగం. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య, పశువైద్య కేంద్రాలు, సామాజిక భవనాలు, క్రీడా మైదానాలు, శ్మశానవాటికలు, మార్కెట్ యార్డులు, సంతలు, కల్యాణ మండపాలు, గ్రంథాలయాలు నిర్మించనున్నారు. అలాగే పాఠశాలలకు అదనపు గదులు, ప్రయోగశాలలు, వంట గదులు, వ్యాయామశాలలు, ప్రజా మరుగుదొడ్లు, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, ప్రహరీ గోడలు, రహదారులు, కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

Advertisement

వివరాలు 

జీవనోపాధి విభాగంలో..

వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి భూమి అభివృద్ధి, సంరక్షణ పనులు, రాతిగట్లు, వ్యవసాయ వ్యర్థాలతో కంపోస్టు తయారీ, పండ్ల తోటల పెంపకం, పట్టు పరిశ్రమకు అవసరమైన వసతులు కల్పిస్తారు. పశువులు, మేకలు, కోళ్ల షెడ్లు, చేపల చెరువులు, కల్లాలు, చేపలు ఎండబెట్టే ప్లాట్‌ఫారాలు, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, శుద్ధి కేంద్రాలు నిర్మించనున్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, గ్రామీణ హస్తకళల శిక్షణ కేంద్రాలు, కుటీర పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

వివరాలు 

విపత్తుల నిర్వహణ విభాగంలో..

ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని తగ్గించే చర్యలకు ప్రాధాన్యం ఇస్తూ వరద రక్షణ గోడలు, గట్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ చేపడతారు. కొండచరియలు విరిగిపడకుండా నివారించే పనులు,నేల స్థిరీకరణ చర్యలు,విపత్తుల అనంతర పునరావాస కార్యక్రమాలు అమలు చేస్తారు. గ్రామీణ రహదారులు,సామాజిక ఆస్తుల పునరుద్ధరణ, మొక్కల పెంపకం, అడవుల్లో మంటలు నివారించే చర్యలు, అగ్నిమాపక పరికరాల నిల్వ కేంద్రాలు, అటవీ జంతువులు, పక్షుల సంరక్షణ కేంద్రాల పునరుద్ధరణ పనులు కూడా ఈ విభాగంలో చోటు చేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీ-జీ రాంజీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు సహజ వనరుల పరిరక్షణ, మౌలిక సదుపాయాల విస్తరణ, జీవనోపాధి అవకాశాల పెంపు, విపత్తుల నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement