LOADING...
AP: గన్నవరంలో తొలి క్వాంటమ్‌ డీప్‌టెక్‌ ఇంక్యుబేటర్‌.. మేధా టవర్స్‌లో నేడు ప్రారంభం
గన్నవరంలో తొలి క్వాంటమ్‌ డీప్‌టెక్‌ ఇంక్యుబేటర్‌.. మేధా టవర్స్‌లో నేడు ప్రారంభం

AP: గన్నవరంలో తొలి క్వాంటమ్‌ డీప్‌టెక్‌ ఇంక్యుబేటర్‌.. మేధా టవర్స్‌లో నేడు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ క్వాంటమ్‌ డీప్‌టెక్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని తొలి క్వాంటమ్‌ డీప్‌టెక్‌ ఇంక్యుబేటర్‌ను గన్నవరంలోని మేధా టవర్స్‌లో శుక్రవారం ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. చండీగఢ్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఇంక్యుబేటర్‌ ద్వారా డీప్‌టెక్‌ రంగంలో పనిచేసే స్టార్టప్‌లకు సమగ్ర సహకారం అందించనున్నారు. ముఖ్యంగా క్వాంటమ్‌ టెక్నాలజీ, కృత్రిమ మేధ (ఏఐ), అడ్వాన్స్‌డ్‌ సెమికండక్టర్లు, రోబోటిక్స్‌, స్పేస్‌ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో పనిచేసే స్టార్టప్‌ల అభివృద్ధికి ఇది వేదికగా నిలవనుంది.

వివరాలు 

మార్కెట్‌ లింకేజీలను కూడా కల్పించనున్న ప్రభుత్వం

ఈ ఇంక్యుబేటర్‌ ద్వారా డీప్‌టెక్‌ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు చేపట్టేందుకు అనుకూలమైన ఎకోసిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం (మెంటార్‌షిప్‌), పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యం, పెట్టుబడిదారులతో అనుసంధానం, ఇంక్యుబేషన్‌కు అవసరమైన మౌలిక సదుపాయాలు, పరిశ్రమలతో అనుసంధాన వ్యవస్థ వంటి పలు కీలక సేవలను ఈ కేంద్రం అందించనుంది. అంతేకాకుండా డీప్‌టెక్‌ స్టార్టప్‌లు తమ ఉత్పత్తులు, సేవలను మార్కెట్‌కు చేరువ చేసేలా మార్కెట్‌ లింకేజీలను కూడా కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో కొత్త ఆలోచనలకు ప్రోత్సాహం లభించడంతో పాటు యువ పారిశ్రామికవేత్తలకు ప్రపంచ స్థాయి అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వివరాలు 

డీప్‌టెక్‌ రంగ అభివృద్ధికి మరింత ఊతం

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీటీఎస్‌ ఛైర్మన్‌ మన్నవ మోహనకృష్ణ, అమరావతి క్వాంటమ్‌ మిషన్‌ డైరెక్టర్‌ సీవీ శ్రీధర్‌, ఆర్‌టీఐహెచ్‌ సీఈవో ధాత్రి రెడ్డి, చండీగఢ్‌ విశ్వవిద్యాలయం ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ ఇంక్యుబేటర్‌ ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్‌లో డీప్‌టెక్‌ రంగ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Advertisement