QS World University Rankings 2027: క్యూఎస్ ర్యాంకింగ్స్‌లో 2 తెలంగాణ విద్యాసంస్థలు.. ఈసారి ఉస్మానియా స్థానం గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిష్ఠాత్మక క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027లో తెలంగాణ నుంచి రెండు విద్యాసంస్థలు మాత్రమే స్థానం సంపాదించాయి. ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో బోధన, పరిశోధన, అంతర్జాతీయ గుర్తింపు, అధ్యాపకుల పనితీరు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించే అంతర్జాతీయ ఉన్నత విద్యా సంస్థ క్వాకరెల్లీ సైమండ్స్ (QS) గురువారం తాజా జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1,500కుపైగా ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకులు కేటాయించగా, తెలంగాణ నుంచి ఐఐటీ హైదరాబాద్ (IIT-H), హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) మాత్రమే జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఐఐటీ హైదరాబాద్ తన ర్యాంకును గణనీయంగా మెరుగుపరుచుకోగా, హెచ్‌సీయూ ర్యాంకు తగ్గింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక్క విద్యాసంస్థ కూడా ఈసారి ర్యాంకింగ్స్‌లో స్థానం పొందలేకపోయింది.
వివరాలు
ఐఐటీ హైదరాబాద్‌కు మెరుగైన ర్యాంకు
ఐఐటీ హైదరాబాద్ గత కొన్నేళ్లుగా తన పనితీరును క్రమంగా మెరుగుపరుచుకుంటోంది. 2025లో ఈ సంస్థ 681-690 ర్యాంకుల మధ్య నిలవగా, 2026లో 664వ స్థానానికి చేరుకుంది. తాజాగా విడుదలైన క్యూఎస్ ర్యాంకింగ్స్-2027లో 588వ ర్యాంకు సాధించి విశేష పురోగతి నమోదు చేసింది. పరిశోధన రంగంలో మెరుగైన ఫలితాలు సాధించడం,అధ్యాపకుల పరిశోధనలకు అధిక సైటేషన్లు రావడం వంటి అంశాలు ఈ విజయానికి దోహదపడ్డాయి. ముఖ్యంగా ఫ్యాకల్టీ సైటేషన్స్ సూచీలో సంస్థ స్కోర్ 86.80కు పెరగడం ర్యాంకు మెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది.
వివరాలు
హెచ్‌సీయూకు తగ్గిన స్థానం
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం గత రెండు సంవత్సరాల్లో 801-850 ర్యాంకుల మధ్య కొనసాగింది. అయితే ఈసారి 851-900 ర్యాంకుల పరిధికి పడిపోయింది. భవిష్యత్తులో మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఇన్‌ఛార్జి వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జె. అనురాధ తెలిపారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన, అంతర్జాతీయ భాగస్వామ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉస్మానియాకు నిరాశ రెండేళ్లుగా 1,201-1,400 ర్యాంకుల పరిధిలో కొనసాగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈసారి 1,500 విశ్వవిద్యాలయాల జాబితాలో కూడా చోటు సంపాదించలేకపోయింది. ఈ అంశంపై స్పందించిన వీసీ ఆచార్య ఎం. కుమార్, ర్యాంకింగ్స్‌లో స్థానం దక్కకపోవడానికి గల కారణాలను సమీక్షించి, అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.
వివరాలు
బిట్స్-పిలానీ, అమిటీ వర్సిటీలకు గుర్తింపు
హైదరాబాద్‌లో క్యాంపస్‌లు నిర్వహిస్తున్న డీమ్డ్ యూనివర్సిటీ బిట్స్-పిలానీ కూడా ఈసారి తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. గతంలో 668వ స్థానంలో ఉన్న ఈ సంస్థ తాజాగా 575వ ర్యాంకుకు చేరుకుంది. అదేవిధంగా అమిటీ యూనివర్సిటీ 901-950 ర్యాంకుల మధ్య స్థానం సంపాదించి జాబితాలో నిలిచింది. 52 విశ్వవిద్యాలయాలతో భారత్ ఘనత క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027లో భారత్ ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. దేశానికి చెందిన మొత్తం 52 విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. దీంతో అమెరికా, బ్రిటన్, చైనా, జర్మనీ తర్వాత ప్రపంచంలో అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన ఉన్నత విద్యా వ్యవస్థగా భారత్ నిలిచింది. భారతీయ విద్యాసంస్థలు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను మరింత బలంగా చాటుతున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
అగ్రస్థానంలో ఐఐటీ దిల్లీ
భారతీయ విద్యాసంస్థల్లో ఐఐటీ దిల్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ సంస్థ 118వ ర్యాంకు సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది 123వ స్థానంలో ఉన్న ఐఐటీ దిల్లీ, ఈసారి ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.