LOADING...
Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో 60 రోజుల ఉచిత ప్రయాణం.. ప్రపంచ దేశాలకు ఇరాన్ భారీ ఆఫర్ !
ప్రపంచానికి ఇరాన్ గుడ్‌న్యూస్.. హర్మూజ్ జలసంధిలో 60 రోజుల ఉచిత ప్రయాణం..

Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో 60 రోజుల ఉచిత ప్రయాణం.. ప్రపంచ దేశాలకు ఇరాన్ భారీ ఆఫర్ !

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2026
08:59 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో కుదిరిన 14 సూత్రాల తాత్కాలిక అవగాహన ఒప్పందం అమలులో భాగంగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు, వాణిజ్య రవాణాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు రాబోయే 60 రోజుల పాటు ట్రాన్సిట్ ఫీజులను పూర్తిగా మినహాయిస్తున్నట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం,రెండు నెలల పాటు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వివిధ దేశాల వాణిజ్య నౌకలు ఎలాంటి రవాణా రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా, ఈ కాలంలో నౌకల రాకపోకలకు సంబంధించిన అనుబంధ ఖర్చులను కూడా ఇరాన్ ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించింది.

వివరాలు 

అమెరికా రక్షణ శాఖ కూడా కీలక నిర్ణయం

అయితే భద్రతా కారణాలు, కార్యాచరణ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నౌక పర్షియన్ గల్ఫ్ జలసంధి అథారిటీ నుంచి ముందస్తు అనుమతి పొందాలని స్పష్టం చేసింది. అలాగే అధికార యంత్రాంగం నిర్దేశించిన ప్రత్యేక సముద్ర మార్గాల్లోనే ప్రయాణించాల్సి ఉంటుందని పేర్కొంది. అమెరికా-ఇరాన్ తాత్కాలిక అవగాహన ఒప్పందంలో భాగంగా అమెరికా రక్షణ శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై అమల్లో ఉన్న నౌకాదళ దిగ్బంధనాన్ని అమెరికా సైన్యం అధికారికంగా నిలిపివేసింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇరాన్ పోర్టులకు రాకపోకలు సాగించే అవకాశం ఏర్పడింది. ఈ దిగ్బంధనం ఎత్తివేయడంతో హర్మూజ్ జలసంధి ద్వారా భారీ స్థాయిలో ముడి చమురు రవాణా మళ్లీ ఊపందుకుంది.

వివరాలు 

అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలు మరింత సులభతరం

రోజుకు లక్షలాది బ్యారెళ్ల చమురు సరఫరా సాఫీగా సాగుతుండటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఇంధన దిగుమతులపై ఆధారపడిన దేశాలకు ఊరటనిచ్చే పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధ పరిస్థితులు, ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా ప్రభావితమైన సముద్ర వాణిజ్యాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్ అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేసింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలు మరింత సులభతరం కానున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు వాటా కలిగిన హర్మూజ్ జలసంధిలో ప్రస్తుతం 60 రోజుల ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై అమెరికా,ఇరాన్ మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.

Advertisement

వివరాలు 

హర్మూజ్ జలసంధి రవాణా రుసుముల అంశానికి కూడా ఇరు దేశాలు తుది పరిష్కారం కనుగొనే అవకాశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ జలసంధి గుండా శాశ్వతంగా ఉచిత రవాణా కొనసాగాలని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరోవైపు, ఇరాన్ అధికారులు మాత్రం 60 రోజుల గడువు ముగిసిన తర్వాత పర్యావరణ పరిరక్షణ, రవాణా సేవల నిర్వహణ పేరుతో తిరిగి ట్రాన్సిట్ ఫీజులు విధించే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న సమగ్ర దౌత్య చర్చలు కీలకంగా మారనున్నాయి. అణు కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు, ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షల శాశ్వత ఎత్తివేతతో పాటు హర్మూజ్ జలసంధి రవాణా రుసుముల అంశానికి కూడా ఇరు దేశాలు తుది పరిష్కారం కనుగొనే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement