Murine Typhus: కేరళలో మరో అరుదైన వ్యాధి.. మురిన్ టైఫస్ లక్షణాలు,చికిత్స, నివారణ
కేరళకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి ఇటీవల అరుదైన బ్యాక్టీరియా వ్యాధి మురిన్ టైఫస్ సోకింది. విదేశాలకు వెళ్లి వచ్చిన తరువాత జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర అలసటతో ఆస్పత్రిలో చేరిన వృద్ధుడికి, మెడికల్ టెస్టుల ద్వారా మురిన్ టైఫస్ నిర్ధారణ అయ్యింది. రోగికి కాలేయం, మూత్రపిండాలకు ఇన్ఫెక్షన్ కలిగినట్లు వైద్యులు గుర్తించారు. వృద్ధుడి నమూనాలను నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్‌కు పంపిన తరువాత, తమిళనాడులోని వెల్లూరులో మరిన్ని పరీక్షల ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయబడింది. ఈ మురిన్ టైఫస్‌ను ఫ్లీ బోర్న్ టైఫస్ లేదా ఫ్లీ బోర్న్ స్పాటెడ్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. వృద్ధుడు ఇటివల వియత్నాం, కంబోడియా వంటి దేశాలకు వెళ్లినట్లు వైద్యులు వెల్లడించారు.
మురిన్ టైఫస్ వ్యాప్తి
మురిన్ టైఫస్ ఫ్లీ బోర్న్ బాక్టీరియా రికెట్సియా టైఫి ద్వారా సంక్రమిస్తుంది. ఈ బాక్టీరియా సోకిన దోమ మనుషులను కుట్టినప్పుడు వ్యాధి వ్యాపిస్తుంది. ఎలుకలు, ముంగిసల వంటి జంతువుల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు కూడా మురిన్ టైఫస్ వ్యాధి సోకుతాయి. ఒకసారి దోమకి ఈ వ్యాధి సోకినప్పుడు, దాని శరీరంలో జీవితాంతం ఉంటుంది. దోమ మలము మన చర్మంతో తాకినప్పుడు కూడా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఈ వ్యాధి క్రమం తప్పకుండా కనిపించింది.
మురిన్ టైఫస్ లక్షణాలు
వైరస్ సోకిన 7-14 రోజులలో మురిన్ టైఫస్ లక్షణాలు బయటపడతాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, వికారం, వాంతులు, కడుపు నొప్పి, చర్మంపై దద్దుర్లు మొదలైనవి లక్షణాలుగా ఉంటాయి. ఈ లక్షణాలు రెండు వారాల కంటే ఎక్కువగా ఉంటాయి. కానీ, చికిత్స చేయకపోతే, నెలల పాటు వ్యాధి కొనసాగవచ్చు.
మురిన్ టైఫస్ చికిత్స
ప్రస్తుతం మురిన్ టైఫస్‌కు ప్రత్యేకమైన చికిత్స లేదా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కానీ డాక్సీసైక్లిన్ వంటి యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి కొద్దికాలంలోనే తీవ్రమవుతుంది, ముఖ్యంగా చికిత్స ఆలస్యం చేస్తే ప్రాణాంతకమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మురిన్ టైఫస్ నివారణ పెంపుడు జంతువులు ఉన్న ఇళ్లలో దోమల నివారణ కృషి చేయాలని, వాటిని క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచాలని, అవసరమైతే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.