10 trillion suns: 10 ట్రిలియన్ సూర్యుల వెలుగుతో.. అతి పెద్ద బ్లాక్ హోల్ ఫ్లేర్
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్ష శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ చూడని భారీ వెలుగు మెరుపును ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ నుంచి గుర్తించారు. దీనికి "సూపర్‌మ్యాన్" అనే పేరును కూడా పెట్టారు.భూమికి దాదాపు 10 బిలియన్ లైట్-యేళ్ల దూరంలో ఉన్న ఈ వెలుగు, తన అత్యధిక సమయంలో 10 ట్రిలియన్ సూర్యులు కలిసి వెలిగినంత ప్రకాశం విడుదల చేసింది. ఈ మహా వెలుగు ఒక యాక్టివ్ గెలాక్టిక్ న్యూక్లియస్ (AGN) నుంచి వచ్చింది. గెలాక్సీ మధ్యలో చాలా వెలిగే ఒక భాగం ఉంటుంది. అక్కడ ఉన్న పెద్ద బ్లాక్ హోల్ వైపు గ్యాస్, ధూళి గిరగిరా తిరుగుతూ నెమ్మదిగా లోపలకి జారిపోతుంటాయి. ఆ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే వేడి, ఘనమైన రేడియేషన్‌ను విడుదల చేస్తుంది.
వివరాలు
అమెరికాలోని కేలిఫోర్నియా పాలమార్ పరిశోధనా కేంద్రంలోని టెలిస్కోపులు ఈ వెలుగును మొదట గుర్తించాయి.
శాస్త్రవేత్తలు ఈ బ్లాక్ హోల్ ఇంత భారీ వెలుగు ఎందుకు విడుదల చేసిందో పరిశీలించగా,ఇది ఒక మహా భారీ నక్షత్రాన్ని పూర్తిగా నులిమి మింగివేసిందని వారు నిర్ధారించారు. సాధారణంగా ఇటువంటి సంఘటనలు లక్షల్లో ఒకటి మాత్రమే జరుగుతాయి. 2018 నవంబరులో అమెరికాలోని కేలిఫోర్నియా పాలమార్ పరిశోధనా కేంద్రంలోని టెలిస్కోపులు ఈ వెలుగును మొదట గుర్తించాయి. మొదట ఇది సాధారణ బ్లాక్ హోల్ జెట్‌లా కనిపించింది. కానీ ఐదేళ్ల తర్వాత మరోసారి పాత డేటాను పరిశీలించగా,ఇది అసాధారణమైన శక్తిని విడుదల చేస్తోందని తెలిసింది. తదుపరి హవాయి లోని కెక్ అబ్జర్వేటరీ టెలిస్కోప్ తో చేసిన పరిశీలనల్లో ఇది కనీసం మన సూర్యుడి కంటే 500 మిలియన్ల రెట్లు భారీ బ్లాక్ హోల్ అని నిర్ధారించారు.
వివరాలు
ఈ "సూపర్‌మ్యాన్" సంఘటన దానికంటే 30రెట్లు శక్తివంతమైనది
సూర్యుడి కంటే 30 రెట్లు పెద్ద నక్షత్రాన్ని ఇదే బ్లాక్ హోల్ లాగేసి,ముక్కలుచేసి మింగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి ముందు"స్కేరీబార్బీ"అనే మరో సంఘటన రికార్డులో ఉన్నా,ఈ "సూపర్‌మ్యాన్" సంఘటన దానికంటే 30రెట్లు శక్తివంతమైనది. ఇది కేవలం ఒక ఖగోళ అద్భుతం మాత్రమే కాదు.. గెలాక్సీలు ఎలా ఏర్పడతాయి, బ్లాక్ హోల్ చుట్టూ భారీ నక్షత్రాలు ఎలా ఉంటాయి, అవి ఎలా నాశనం అవుతాయి అన్న విషయాలపై కొత్త అర్థాలను ఈ పరిశోధన ఇస్తోంది. "గెలాక్సీ ఎంత క్లిష్టంగా,ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో ఈ సంఘటన స్పష్టంగా చూపింది" అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తానికి, ఇది విశ్వం ఎంత విస్తారమైందో,దాని లోపల ఉన్న రహస్యాలు ఎంత అపారమైనవో మనిషికి మరోసారి గుర్తు చేసిన సంఘటనగా నిలిచింది.