Loading...
Leonid Meteor Shower: హైదరాబాద్ ఆకాశంలో లియోనిడ్ ఉల్కాపాతం.. కెమెరాల్లో 87 ఉల్కల రికార్డు
హైదరాబాద్ ఆకాశంలో లియోనిడ్ ఉల్కాపాతం.. కెమెరాల్లో 87 ఉల్కల రికార్డు

Leonid Meteor Shower: హైదరాబాద్ ఆకాశంలో లియోనిడ్ ఉల్కాపాతం.. కెమెరాల్లో 87 ఉల్కల రికార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
08:05 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ ఆకాశంలో కనువిందు చేసిన లియోనిడ్ ఉల్కాపాతం అద్భుత దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. నగరానికి చెందిన ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్తలు ఈ అరుదైన దృశ్యాలను చిత్రీకరించారు. నవంబర్ 17, 18 తేదీల్లో ఉల్కాపాతం గరిష్ఠ స్థాయికి చేరుకున్న సమయంలో మొత్తం 87 ఉల్కలను గుర్తించి రికార్డు చేసినట్లు తాజాగా వెల్లడించారు. షేక్‌పేట్‌లో ఏర్పాటు చేసిన స్టార్ గేజర్స్ టెర్రస్ అబ్జర్వేషన్ స్టేషన్‌ నుంచి ఈ చిత్రీకరణ చేపట్టారు.

వివరాలు 

ఏటా నవంబర్‌లో కనిపించే ఉల్కాపాతం

లియోనిడ్ ఉల్కాపాతం ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఏర్పడుతుంది. 55పీ/టెంపుల్‌-టటిల్‌ (55P/Tempel-Tuttle) అనే తోకచుక్క అంతరిక్షంలో వదిలివెళ్లిన ధూళి కణాల గుండా భూమి ప్రయాణించడం వల్ల ఈ ఖగోళ అద్భుతం చోటుచేసుకుంటుంది.

ఈ కణాలు భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు మండుతూ కాంతిరేఖలుగా కనిపిస్తాయి.

ఇవి సెకనుకు సుమారు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అందుకే లియోనిడ్ ఉల్కలు అత్యంత వేగంగా కదిలే ఉల్కలుగా గుర్తింపు పొందాయి.

వివరాలు 

ప్రత్యేక కెమెరాలతో చిత్రీకరణ

ఈ ఉల్కాపాతాన్ని స్పష్టంగా చిత్రీకరించేందుకు స్టార్ గేజర్స్‌కు చెందిన సయ్యద్ విలాయత్ హుస్సేన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

యూకే నుంచి దిగుమతి చేసుకున్న నాలుగు ప్రత్యేకమైన 'టాపోస్ సి325 డబ్ల్యూబీ వి2' (Tapo C325WB V2) మోడల్ సీసీటీవీ కెమెరాలను ఇందుకోసం ఉపయోగించారు.

వీటి సాయంతో హైదరాబాద్ ఆకాశంలో కనిపించిన ఉల్కల కదలికలను రికార్డు చేశారు. ఈ క్రమంలో మొత్తం 87 ఉల్కలు కెమెరాలకు చిక్కాయి.

ADVERTISEMENT

వివరాలు 

నవంబర్ 18 తెల్లవారుజామున గరిష్ఠ స్థాయికి

నవంబర్ 17వ తేదీ రాత్రి ప్రారంభమైన ఉల్కాపాతం 18వ తేదీ తెల్లవారుజాము వరకు కొనసాగింది.

ముఖ్యంగా నవంబర్ 18న ఉదయం 5.15 గంటలకు ఇది గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

ఆ సమయంలో గంటకు సుమారు 15 ఉల్కలు కనిపించే అవకాశం ఉందని ఖగోళ నిపుణులు ముందుగానే అంచనా వేశారు.

మరోవైపు తెల్లవారుజామునకు ముందే చంద్రుడు అస్తమించడంతో ఆకాశం చీకటిగా, నిర్మలంగా మారింది.

దీంతో ఉల్కలను పరిశీలించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

ADVERTISEMENT

వివరాలు 

నెలాఖరు వరకు కొనసాగనున్న ఉల్కాపాతం

లియోనిడ్ ఉల్కాపాతం నవంబర్ నెలాఖరు వరకు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ, గరిష్ఠ స్థాయి దాటిన తర్వాత ఉల్కల సంఖ్య క్రమంగా తగ్గుతుంది.

నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆకాశంలో కనిపించే అనేక ఖగోళ అద్భుతాల్లో లియోనిడ్ ఉల్కాపాతం కూడా ఒకటి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు ఆసక్తి చూపించారు.

ADVERTISEMENT