Mark Zuckerberg: నగర అనుమతులు లేకుండా స్కూల్ నిర్వహణ.. మార్క్ జూకర్ బర్గ్ పై పొరుగువారి ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
పాలో అల్టోలో ఉన్న తన ఇంటి ప్రాంగణంలో చట్టవిరుద్ధంగా పాఠశాల నడిపినట్టు మెటా CEO మార్క్ జూకర్ బర్గ్ పై ఆరోపణలు వచ్చాయి. అమెరికా కాలిఫోర్నియాలోని పాలో అల్టో నగరంలోని క్రెసెంట్ పార్క్ ప్రాంతంలో జకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ కలిపి 11 ఇళ్లు కొనుగోలు చేశారు. వాటిలో ఐదు ఇళ్లు ఒకే ప్రాంగణంగా కలిపి పెద్ద కుటుంబ క్యాంపస్‌లా తయారైంది.అక్కడే తాజాగా సమస్య మొదలైంది. 'బికెన్ బెన్ స్కూల్' అని పిలిచే ఒక చిన్న పాఠశాల 2021 నుంచి ఆ ఇంటి లోపలే నడుస్తోందని స్థానికులు గుర్తించారు. ఈ స్కూల్‌కు సరైన సిటీ అనుమతులు లేవని తెలిసింది. ఈ పాఠశాలలో 30 మంది వరకు పిల్లలు చదువుతున్నారని సమాచారం.
వివరాలు
ఎవరికి ప్రత్యేక సడలింపులు ఇవ్వలేదని స్పష్టం చేసిన నగర అధికారులు
దీనిపై ఆప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది నివాస ప్రాంతం అని,ఇక్కడ స్కూల్ నడపడం చట్టపరంగా నిషేధం అని నగర అధికారులకు ఫిర్యాదులు చేశారు. కొంతమంది పెద్ద బిలియనీర్లకు ప్రత్యేక సౌకర్యాలు ఇస్తున్నారని సిటీ అధికారులనే ప్రశ్నించారు. "మేము మీ మీద నమ్మకం పెట్టుకోలేం.ఈ ఇంటి యజమాని మంచిగా వ్యవహరిస్తాడని భావించి తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది"అని ఓ స్థానికుడు అధికారులకు కఠినంగా చెప్పాడు. ఇక నగర అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రత్యేక సడలింపులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. యజమాని ఎంతవాడన్నది ముఖ్యం కాదు,నియమాలు అందరికీ ఒకేలా వర్తిస్తాయి"అని సిటీ అధికారులు తెలిపారు. ఈ విషయంపై జకర్‌బర్గ్ కుటుంబంతో చర్చలు జరిపి,పరిష్కారానికి చర్యలు మొదలు పెట్టామని చెప్పింది నగర యాజమాన్యం.
వివరాలు
స్కూల్ వేరే ప్రదేశానికి మార్చాం
2025 మార్చి నాటికి,ఆ స్కూల్‌ను జూన్ 30లోపు మూసేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. స్థానికుల మాటల ప్రకారం ఆ వేసవిలో స్కూల్ మూసేసారు.అయితే జకర్‌బర్గ్ తరఫు ప్రతినిధులు మాత్రం "స్కూల్ మూయలేదు, కేవలం వేరే ప్రదేశానికి మార్చాం" అని చెప్పారు. ఆ కొత్త ప్రదేశం ఎక్కడో మాత్రం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇప్పటి వరకు ఈ ప్రాంగణం కారణంగా అధిక భద్రతా వాహనాలు,నిర్మాణ పనుల శబ్దం,రాకపోకల ఇబ్బందులు అంటూ స్థానికులు ఎన్నో సార్లు ఫిర్యాదు చేశారు. కొంతమంది అయితే "ఇది పక్కన ఉండడం చాలా కష్టంగా మారింది"అని కూడా చెప్పుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి కొంత సద్దుమణిగినా,క్రెసెంట్ పార్క్‌లో ఒక కుటుంబం ప్రభావం ఎంతవరకు ఉండాలి అన్న చర్చ మాత్రం ఇంకా ఆగేలా లేదు.