Meta AI: టీనేజర్ల భద్రతకు మెటా కొత్త ఫీచర్.. ఆత్మహత్యకు సంబంధించిన చాట్స్ ఉంటే పేరెంట్స్‌కు వెంటనే అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
టీనేజర్ల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మెటా కీలక నిర్ణయం తీసుకుంది. తన AI చాట్‌బాట్‌ను ఉపయోగిస్తున్న టీనేజర్ల కోసం కొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. టీనేజర్లు ఆత్మహత్య లేదా స్వీయ హాని (Self-Harm)కు సంబంధించిన విషయాలపై చాట్ చేస్తే, వారి తల్లిదండ్రులకు వెంటనే అలర్ట్ వెళ్లేలా ఈ ఫీచర్‌ను రూపొందించింది. సమస్యను ముందుగానే గుర్తించి, పిల్లలకు తల్లిదండ్రులు లేదా నమ్మకమైన పెద్దలు, నిపుణుల నుంచి సకాలంలో సహాయం అందేలా చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని మెటా తెలిపింది. ఈ కొత్త వ్యవస్థలో భాగంగా, టీనేజర్లు మెటా AIతో జరిపే సంభాషణలను ఆత్మహత్య లేదా స్వీయ హానికి సంబంధించిన సంకేతాల కోసం విశ్లేషిస్తుంది.
వివరాలు
ఇన్‌స్టాగ్రామ్ పేరెంటల్ సూపర్విజన్ టూల్..
అలాంటి పదాలు లేదా సంభాషణలు గుర్తిస్తే, మెటా పేరెంటల్ సూపర్విజన్ టూల్స్ ద్వారా తల్లిదండ్రులకు వెంటనే నోటిఫికేషన్ పంపుతుంది.
ఈ అలర్ట్‌ల ద్వారా పరిస్థితి తీవ్రతను తల్లిదండ్రులు ముందుగానే గుర్తించి, అవసరమైన సమయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కెనడాలో ఇన్‌స్టాగ్రామ్ పేరెంటల్ సూపర్విజన్ టూల్‌ను ఉపయోగిస్తున్న తల్లిదండ్రులకు అందుబాటులో ఉంది.
ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా పేరెంటల్ సూపర్విజన్ ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు మెటా వెల్లడించింది.
వివరాలు
తల్లిదండ్రులకు సమాచారం పంపే సేఫ్టీ ఫీచర్..
ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్లు తక్కువ వ్యవధిలో వరుసగా ఆత్మహత్య లేదా స్వీయ హానికి సంబంధించిన కంటెంట్‌ను వెతికితే తల్లిదండ్రులకు సమాచారం పంపే సేఫ్టీ ఫీచర్ అందుబాటులో ఉందని మెటా గుర్తు చేసింది.
తాజా అలర్ట్ వ్యవస్థ ఆ భద్రతా చర్యలకు మరింత బలాన్ని చేకూరుస్తుందని తెలిపింది.
ఇదిలా ఉండగా, మెటా మరో కీలక భద్రతా ఫీచర్‌పైనా పనిచేస్తోంది.
మెటా AIతో జరిగే సంభాషణల్లో ఎవరైనా తక్షణ ప్రమాదంలో ఉన్నట్లు సంకేతాలు కనిపిస్తే, అత్యవసర సేవల సంస్థలకు కూడా సమాచారం అందించే విధంగా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది.
ఇప్పటికే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆత్మహత్యకు సంబంధించిన విశ్వసనీయ ప్రమాద సంకేతాలు కనిపించిన సందర్భాల్లో అత్యవసర సేవలకు సమాచారంఅందించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా 19 వేలకుపైగా కేసులు..
గత ఏడాది మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి 19 వేలకుపైగా కేసులను సంబంధిత అత్యవసర సేవలకు పంపినట్లు వెల్లడించింది.
అదే సమయంలో టీనేజర్ల ఖాతాల కోసం మరింత కఠినమైన డిఫాల్ట్ సెట్టింగ్‌లను కూడా మెటా అమలు చేస్తోంది.
ఇకపై టీన్ అకౌంట్లు ఆటోమేటిక్‌గా "13+" కంటెంట్ సెట్టింగ్ కింద ఉంటాయి.
ఈ నిబంధనలు మెటా AIతో జరిగే సంభాషణలకూ వర్తిస్తాయి. ఈ సెట్టింగ్‌లో మెటా AI టీనేజర్ల వయస్సుకు తగిన సమాధానాలనే ఇస్తుంది.
అలాగే సున్నితమైన అంశాలకు సంబంధించిన ప్రాంప్ట్‌లతో సంభాషణను కొనసాగించకుండా పరిమితులు అమలు చేస్తుంది.