Meta Muse: వినియోగదారుల తరఫున పనులు చేసే ఏఐ ఏజెంట్‌ను తీసుకొచ్చిన మెటా
ఈ వార్తాకథనం ఏంటి
వినియోగదారుల తరఫున రోజువారీ పనులు చేసే కొత్త వ్యక్తిగత కృత్రిమ మేధ (AI) ఏజెంట్ 'మ్యూస్'ను మెటా (Meta) తీసుకొచ్చింది. ఇప్పటివరకు చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్‌లు ప్రధానంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, వినియోగదారులతో డిజిటల్ సహచరుల్లా మాట్లాడటానికే పరిమితమయ్యాయి. అయితే మ్యూస్ మాత్రం వినియోగదారులు చెప్పిన పనులను స్వయంగా పూర్తి చేసేలా రూపొందించినట్లు మెటా తెలిపింది. మ్యూస్‌ను ఉపయోగించాలంటే వినియోగదారులు గతంలో కంటే ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని మెటాతో పంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఏఐ ఏజెంట్ వినియోగదారులు రోజువారీగా ఉపయోగించే ఈమెయిల్, క్యాలెండర్, చెల్లింపులు, ఆరోగ్యం-ఫిట్‌నెస్ యాప్స్, స్మార్ట్ హోమ్ పరికరాలు, భోజన సేవలు, షాపింగ్ ప్లాట్‌ఫామ్‌ల వంటి వాటితో అనుసంధానమవుతుంది.
వివరాలు
రోజువారీ పనుల నుంచి షాపింగ్ వరకు.. మ్యూస్ చేసే పనులివే..
ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కంటే వినియోగదారుల తరఫున పనులు పూర్తి చేయడమే మ్యూస్ ప్రధాన ఉద్దేశమని మెటా చెబుతోంది.
మ్యూస్‌తో ఈమెయిల్స్ పంపడం, ప్రయాణాలను బుక్ చేయడం, ఫారాలను నింపడం, వివిధ ప్రణాళికలు రూపొందించడం వంటి పనులు చేయించుకోవచ్చు.
అంతేకాకుండా రెసిపీ రీల్స్‌ను కిరాణా సరుకుల జాబితాగా మార్చడం, పార్టీకి ఆహ్వానాలు పంపడం, కొనుగోళ్లు చేయడం కూడా సాధ్యమవుతుంది.
చెల్లింపుల కోసం మ్యూస్ 'లింక్ బై స్ట్రైప్' (Link by Stripe) సేవను ఉపయోగిస్తుంది.
ఏఐ తమ తరఫున కొనుగోలు చేస్తున్నప్పుడు ఎదురయ్యే భద్రతాపరమైన ఆందోళనలను తగ్గించేందుకు కొనుగోళ్లకు ప్రత్యేక రక్షణలు ఉంటాయని మెటా తెలిపింది.
వివరాలు
యాప్స్,సేవల అనుసంధానం.. వినియోగాన్ని బట్టి చార్జీలు
వినియోగదారులు తమకు అవసరమైన యాప్స్,సేవలను ఒక్కొక్కటిగా మ్యూస్‌తో అనుసంధానించుకోవచ్చు.
దీనివల్ల ఏ సమాచారం,ఏ సేవను మ్యూస్ ఉపయోగిస్తుందో స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని కంపెనీ చెబుతోంది.
మ్యూస్ వెబ్‌లో muse.ai ద్వారా,ఐఓఎస్,ఆండ్రాయిడ్ యాప్స్‌లో,వాట్సాప్ చాట్‌లలో అందుబాటులోకి రానుంది.
త్వరలో మెటా ఏఐ గ్లాసెస్‌లోనూ ఈ సేవను తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం మ్యూస్‌ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
అయితే వినియోగం పెరిగే కొద్దీ చెల్లింపు ప్లాన్లు వర్తిస్తాయి. ప్రారంభంలో 'పవర్' ప్లాన్ నెలకు 20 డాలర్లు, 'మ్యాక్సిమమ్' ప్లాన్ నెలకు 100 డాలర్లుగా ఉన్నాయి.
ఈ రెండు ప్లాన్లలో రోజువారీ పనులను ఏఐకి అప్పగించేందుకు ఎక్కువ వినియోగ పరిమితి ఉంటుంది.
అయినప్పటికీ ఎక్కువ మంది వినియోగదారులు ఉచిత ప్లాన్‌లోనే కొనసాగుతారని మెటా అంచనా వేస్తోంది.
వివరాలు
పాస్‌వర్డ్‌లు, చెల్లింపులకు మ్యూస్‌కు యాక్సెస్ ఉండదు
మ్యూస్ భద్రత విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని మెటా చెబుతోంది.
'మ్యూస్ సెక్యూర్ వీఎం' (Muse Secure VM) అనే ప్రత్యేక, సురక్షిత కంప్యూటర్, బ్రౌజర్‌పై ఈ ఏఐ పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
వినియోగదారుల డేటాకు గోప్యత, భద్రత కల్పించేందుకు ఇందులో పలు రక్షణ చర్యలు ఉన్నాయని పేర్కొంది.
ఇదే వర్చువల్ మెషీన్‌లో 'సెంటినెల్' అనే మరో ఏఐ ఏజెంట్ పనిచేస్తుందని, అయితే సిస్టమ్ స్థాయిలో అది మ్యూస్ నుంచి వేరుగా ఉంటుందని వివరించింది.
దీంతో వినియోగదారుల పాస్‌వర్డ్‌లు, చెల్లింపు విధానాలకు మ్యూస్‌కు నేరుగా యాక్సెస్ ఉండదని మెటా స్పష్టం చేసింది.
వివరాలు
మ్యూస్‌పై నమ్మకం ఉంచుతారా?
అయితే మ్యూస్ విజయవంతం కావాలంటే వినియోగదారుల నమ్మకాన్ని మెటా ఎంతవరకు పొందగలదన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
మెటాపై గతంలోనూ గోప్యతకు సంబంధించిన పలు ఆరోపణలు వచ్చాయి.
వినియోగదారుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేసిన ఘటనలపై సంస్థ విమర్శలు ఎదుర్కొంది.
2019లో ఫేస్‌బుక్ గోప్యతకు సంబంధించిన ఎనిమిది ఉల్లంఘనల కేసుల్లో అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) అప్పటివరకు రికార్డు స్థాయిలో 5 బిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్ విధించింది.
దీంతో మ్యూస్ వంటి ఏఐ ఏజెంట్‌కు వ్యక్తిగత సమాచారాన్ని అప్పగించేందుకు వినియోగదారులు ఎంతవరకు సిద్ధపడతారనేది ఆసక్తికరంగా మారింది.