
Microplastics: పేగులోని సూక్ష్మజీవులపై మైక్రోప్లాస్టిక్‌ల ప్రభావం.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
మైక్రోప్లాస్టిక్స్ అనే సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు మన పరిసరాల్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఇవి మన శరీరంలోకి ప్రవేశించడాన్నిఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ, ఇవి మన ఆరోగ్యంపై కలిగించే ప్రభావం ఇంకా స్పష్టంగా అర్థం కాలేదు. తాజాగా నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో వెలువడిన అధ్యయనం ప్రకారం,మైక్రోప్లాస్టిక్స్ మన పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని తేలింది. ఇవి పేగులో ఉండే సూక్ష్మజీవుల సమతుల్యతను మారుస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరిశోధనను తైవాన్‌కు చెందిన నేషనల్ చెంగ్ కుంగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఇందులో వారు ఎలుకలకు పాలిస్టైరిన్ నానోప్లాస్టిక్స్‌ను 12 వారాల పాటు ఆహారంగా ఇచ్చారు.
వివరాలు
ప్లాస్టిక్ కణాల ప్రభావంతో ఎలుకల శరీరంలో పలు మార్పులు
నానోప్లాస్టిక్స్ అనేవి మైక్రోప్లాస్టిక్స్‌లో అత్యంత చిన్న రూపం,వీటి పరిమాణం 100 నానోమీటర్ల చుట్టూ ఉంటుంది. ఇది మానవ జుట్టు వెడల్పుతో పోలిస్తే వేల రెట్లు చిన్నది. పరిశీలనలో భాగంగా,ఈ ప్లాస్టిక్ కణాల ప్రభావంతో ఎలుకల శరీరంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తి, జన్యు కార్యకలాపాలు, బ్యాక్టీరియా స్థాయిలు, కణాల్లోని మైక్రోఆర్‌ఎన్‌ఏ స్థాయిల్లో స్పష్టమైన మార్పులు కనిపించాయి. ఉదాహరణకు, పేగు సంరక్షణకు కీలకమైన రెండు ప్రోటీన్ల ఉత్పత్తి స్థాయిలు తగ్గిపోయాయి. ఆరోగ్యానికి ఉపయోగపడే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా స్థాయి పడిపోయింది. ప్రతికూల ప్రభావం కలిగించే రుమినోకాకసీ అనే బ్యాక్టీరియా పెరిగిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, లాచ్నోస్పిరాసీ అనే మరో బ్యాక్టీరియా ఈ నానోప్లాస్టిక్స్‌ను తినేసినట్టు గుర్తించారు.
వివరాలు
పేగు గోడను కప్పే మ్యూకస్ ఉత్పత్తి
ఈ క్రియాశీలత కారణంగా బ్యాక్టీరియా విడుదల చేసే చిన్న రకమైన కణాలు.. ఎక్స్‌ట్రాసెల్యులర్ వెసికల్స్.. తమ స్వభావాన్ని మార్చాయి. దీనివల్ల పేగు గోడను కప్పే మ్యూకస్ ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ ప్రభావాలన్నింటి కారణంగా ఎలుకల పేగు ఆరోగ్యంపై దుష్ప్రభావం పడినట్లు తేలింది. దీని వల్ల భవిష్యత్‌లో ఆరోగ్య సంబంధిత సమస్యల రిస్క్ పెరిగే అవకాశముందంటూ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. "ఈ అధ్యయనం ప్రకారం, మైక్రోప్లాస్టిక్ కణాలు పేగులో ఉండే సూక్ష్మజీవులతో ఉండే సహజ సంబంధాన్ని ధ్వంసం చేస్తూ, శరీరానికి హానికరం కావచ్చు," అని పరిశోధనను నేతృత్వం వహించిన వీ-హ్సువాన్ హ్సూ వ్యాఖ్యానించారు.
వివరాలు
అధ్యయనానికి కొన్ని పరిమితులు
అయితే, ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎందుకంటే, ఇది ఎలుకలపై నిర్వహించారు. అందువల్ల, వీటి ఫలితాలు నేరుగా మనుషులకు వర్తిస్తాయా అన్నది ఇంకా సందేహాస్పదంగా ఉంది. అంతేకాకుండా, ఈ పరీక్షల్లో ఎలుకలకు ఇచ్చిన నానోప్లాస్టిక్స్ పరిమాణం మానవులు సాధారణంగా అనుభవించే స్థాయికి మారేలా ఉండదు.. అది చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. మనం రోజూ తీసుకునే ప్లాస్టిక్ పరిమాణం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉందా? అన్నది ఇంకా ఖచ్చితంగా తెలియాల్సి ఉంది.
వివరాలు
మైక్రోప్లాస్టిక్స్ మన ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావాలపై శ్రద్ధ అవసరం
ఈ పరిశోధన ద్వారా మైక్రోప్లాస్టిక్స్ మన ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావాలపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. "మనం ఎంత మైక్రోప్లాస్టిక్స్‌కు గురవుతున్నామో, అవి దీర్ఘకాలంలో మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవాలంటే మరిన్ని లోతైన పరిశోధనలు అవసరం," అని తైవాన్‌లోని నేషనల్ సెంట్రల్ యూనివర్సిటీలో పని చేస్తున్న రోగనిరోధక శాస్త్రవేత్త యుహ్-హ్సియా లువో వ్యాఖ్యానించారు.