Microsoft : మైక్రోసాఫ్ట్‌లో భారీ మార్పులు..ఏఐ వల్ల కీలక నిర్ణయాలు
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన సంస్థలో కీలక మార్పులు చేపట్టింది. కాపైలట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి జేకబ్ ఆండ్రియూ ను కొత్త హెడ్‌గా నియమించింది. ఈ నిర్ణయం ద్వారా వినియోగదారుల (కన్స్యూమర్), వ్యాపార (కమర్షియల్) సేవలను ఒకే ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. జేకబ్ ఆండ్రియూ నేరుగా సీఈఓ సత్య నాదెళ్లకు రిపోర్ట్ చేయనున్నారు. కాపైలట్‌కు సంబంధించిన డిజైన్, డెవలప్‌మెంట్, విస్తరణ, ఇంజినీరింగ్ బాధ్యతలను ఆయన పర్యవేక్షిస్తారు.
వివరాలు
ఏఐ మోడళ్లపై సులేమాన్ దృష్టి
ఇక మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం సీఈఓ ముస్తఫా సులేమాన్ తన దృష్టిని ఇప్పుడు కంపెనీకి చెందిన స్వంత ఏఐ మోడళ్ల అభివృద్ధిపై కేంద్రీకరించనున్నారు. ఈ మార్పు జేకబ్ ఆండ్రియూ నియామకం తరువాత తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా తెలుస్తోంది. ఈ మోడళ్లు సంస్థ ఉత్పత్తులను మరింత మెరుగుపరచడంలో సహాయపడతాయని సులేమాన్ తన మెమోలో పేర్కొన్నారు. కొత్త బాధ్యతలు ఉన్నప్పటికీ, ఆయన రోజువారీ కార్యకలాపాల్లో కూడా భాగస్వామిగా కొనసాగుతారు. జేకబ్ ఆండ్రియూతో పాటు రయాన్ రోస్లాన్స్కీ, పెర్రీ క్లార్క్, చార్లెస్ లమన్నా కూడా కాపైలట్ నాయకత్వ బృందంలో భాగమయ్యారు. వీరు మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, కాపైలట్ ప్లాట్‌ఫారమ్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారు.
వివరాలు
కొత్త నాయకత్వ బృందం
సత్య నాదెళ్ల తన మెమోలో కాపైలట్‌ను కన్స్యూమర్, కమర్షియల్ విభాగాల్లో ఒకే వ్యవస్థగా మార్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో కాపైలట్ అనుభవం, ప్లాట్‌ఫారమ్, మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, ఏఐ మోడళ్లు అనే నాలుగు కీలక అంశాలు ఉంటాయని చెప్పారు. ఇప్పటి వరకు వేర్వేరుగా ఉన్న సేవలను ఒక సమగ్ర వ్యవస్థగా మార్చడం ద్వారా వినియోగదారులకు సులభంగా, మరింత శక్తివంతమైన అనుభవం అందించాలన్నదే కంపెనీ ఉద్దేశ్యం.