Page Loader
Mobile Bills: మొబైల్‌ రీఛార్జీలపై చార్జీల మోత.. టారిఫ్‌లు 10-12 శాతం వరకు పెరిగే అవకాశం! 
మొబైల్‌ రీఛార్జీలపై చార్జీల మోత.. టారిఫ్‌లు 10-12 శాతం వరకు పెరిగే అవకాశం!

Mobile Bills: మొబైల్‌ రీఛార్జీలపై చార్జీల మోత.. టారిఫ్‌లు 10-12 శాతం వరకు పెరిగే అవకాశం! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

గతేడాది మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచిన టెలికాం సంస్థలు ఇప్పుడు మళ్లీ టారిఫ్‌లను పెంచేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి టెలికాం కంపెనీలు మొబైల్ టారిఫ్‌లను సుమారు 10-12 శాతం వరకు పెంచే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు,మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 5జీ సేవల విస్తరణ,వినియోగదారుల సంఖ్యలో భారీ వృద్ధి నేపథ్యంలో ఈ పెంపు జరిగే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు. మే నెలలో భారత్‌లో మొబైల్ యాక్టివ్ యూజర్ల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది. ఆ ఒక్క నెలలోనే 74 లక్షల మందికి పైగా కొత్త సబ్‌స్క్రైబర్లు మొబైల్ సేవలకు జతకాగా, ఇది గత 29 నెలల్లో నమోదైన అత్యధిక సంఖ్య కావడం విశేషం.

వివరాలు 

దేశవ్యాప్తంగా యాక్టివ్ మొబైల్ వినియోగదారుల సంఖ్య 108 కోట్లు 

దీనివల్ల దేశవ్యాప్తంగా యాక్టివ్ మొబైల్ వినియోగదారుల సంఖ్య 108 కోట్లకు చేరుకుంది. ఇందులో రిలయన్స్ జియోకి 55 లక్షల మంది కొత్త యూజర్లు వచ్చారు, ఎయిర్‌టెల్‌కు 13 లక్షల మంది చేరారు. వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచే దిశగా కసరత్తులు ప్రారంభించాయని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెఫెరీస్ వెల్లడించింది. గత సంవత్సరం జులైలో బేసిక్ రీఛార్జ్ ప్లాన్‌లు సగటున 11 నుంచి 23 శాతం వరకు పెరిగిన సంగతి తెలిసిందే. ఈసారి టారిఫ్ పెంపు సుమారు 10 నుంచి 12 శాతం మధ్య ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈసారి బేసిక్ ప్లాన్‌లను కాకుండా,మధ్య స్థాయి, ప్రీమియం ప్లాన్‌లపై ఛార్జీల పెంపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వివరాలు 

రీఛార్జ్ ప్లాన్లలో డేటా పరిమాణాన్ని తగ్గించే అవకాశం 

అంతేకాకుండా, వినియోగదారులు ఉపయోగించే డేటా పరిమాణం, డేటా వేగం, డేటా వినియోగ సమయాలు వంటి అంశాల ఆధారంగా ఛార్జీలను పెంచే ప్రణాళికను సంస్థలు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తదుపరి రీఛార్జ్ ప్లాన్లలో డేటా పరిమాణాన్ని తగ్గించే అవకాశమూ ఉంది. డేటా ప్యాక్‌లను వినియోగదారులు ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు రావొచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మొబైల్ టారిఫ్‌లలో మార్పులు అవసరమని ఎయిర్‌ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థల ప్రతినిధులు ఇప్పటికే స్పష్టం చేశారు. ''ఇప్పటి టారిఫ్‌లు వినియోగదారుల అప్‌గ్రేడేషన్‌ అవసరాలకు సరిపోవడం లేదు'' అని ఎయిర్‌టెల్‌ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ ఇటీవల జరిగిన సమావేశంలో వ్యాఖ్యానించారు.