Super App: 'సూపర్ యాప్' లక్ష్యంతో మస్క్ కొత్త అడుగు.. ఎక్స్ మనీతో బ్యాంకింగ్ సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్(Elon Musk) తన "ఎవ్రీథింగ్ యాప్" కలను నిజం చేసుకునే దిశగా మరో కీలక అడుగు వేస్తున్నారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో త్వరలో 'ఎక్స్ మనీ' అనే ఫైనాన్షియల్ సర్వీస్ టూల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా బ్యాంకింగ్, పేమెంట్స్ సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ట్రయల్‌గా వాడుతున్న యూజర్లు 3 శాతం క్యాష్‌బ్యాక్,దాదాపు 6 శాతం వడ్డీ వంటి బెనిఫిట్స్‌పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా,ఉచితంగా పియర్-టు-పియర్ ట్రాన్స్‌ఫర్స్,యూజర్ పేరుతో ప్రత్యేక మెటల్ డెబిట్ కార్డ్ కూడా అందించనున్నారు. మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ సంస్థ రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం కూడా ఇందులో భాగం కానుంది. ఇది వినియోగదారుల ఖర్చులను గమనించి,లావాదేవీలను కేటగిరీలుగా విభజిస్తుంది.
వివరాలు
అమెరికాలో పెద్దగా సక్సెస్ కానీ సూపర్ యాప్ కాన్సెప్ట్
మునుపు పేపాల్‌ను స్థాపించిన మస్క్,చైనా లోని WeChat మాదిరిగా అన్ని సేవలు ఒకే యాప్‌లో అందించాలనే లక్ష్యంతో ఉన్నారు. అయితే అమెరికాలో ఈ సూపర్ యాప్ కాన్సెప్ట్ ఇప్పటివరకు పెద్దగా సక్సెస్ కాలేదు. అలాగే ధరలు,ఫీచర్లపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ముఖ్యంగా న్యూయార్క్ సహా కొన్ని రాష్ట్రాల్లో లైసెన్సులు ఇంకా పొందాల్సి ఉంది. 6% వడ్డీ రేటు ఇతర ఫైనాన్స్ సేవలకు పోటీగా ఉన్నప్పటికీ, అది శాశ్వతమా లేక తాత్కాలికమా అనేది స్పష్టత లేదు. నిపుణులు ఈ ప్రాజెక్టుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్స్ ప్లాట్‌ఫామ్‌కు ఉన్న కోట్లాది యూజర్లు,ఇప్పటికే కంటెంట్ క్రియేటర్లకు చెల్లింపులు జరుగుతున్న వ్యవస్థ మస్క్‌కు పెద్ద ప్లస్‌గా మారింది.
వివరాలు
చాట్ ద్వారా డబ్బులు పంపే ఫీచర్ ను పరీక్షిస్తున్న యూజర్లు
త్వరలో క్రియేటర్లకు చెల్లింపులు కూడా ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారానే జరగనున్నాయి. ఇప్పటికే కొంతమంది యూజర్లు చాట్ ద్వారా డబ్బులు పంపడం వంటి ఫీచర్లను పరీక్షిస్తున్నారు. అయితే ఒక యూజర్ అకౌంట్ సస్పెండ్ అయితే, వారి డబ్బుల పరిస్థితి ఏమవుతుందన్నది ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మీద, అమెరికాలో అన్ని రాష్ట్రాల అనుమతులు పొందడం వంటి నియంత్రణ సమస్యలు ఎక్స్ మనీకి సవాలుగా మారుతున్నాయి.