Loading...
White Dwarf Star: ప్రతి 8 నిమిషాలకు రేడియో సంకేతాలు.. 5,000 కాంతి సంవత్సరాల దూరంలో ఏం జరుగుతోంది?
5,000 కాంతి సంవత్సరాల దూరంలో ఏం జరుగుతోంది?

White Dwarf Star: ప్రతి 8 నిమిషాలకు రేడియో సంకేతాలు.. 5,000 కాంతి సంవత్సరాల దూరంలో ఏం జరుగుతోంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2026
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

భూమికి సుమారు 5,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ నక్షత్ర వ్యవస్థ ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వ్యవస్థ నుంచి ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒకసారి బలమైన రేడియో సంకేతాలు వెలువడుతున్నాయి. విశ్వం నుంచి భూమికి చేరే రేడియో సంకేతాల వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా గుర్తించిన సంకేతాలు కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నేచర్ ఆస్ట్రానమీ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వివరాల ప్రకారం.. GPM J071507−114153గా పిలిచే ఈ నక్షత్ర వ్యవస్థలో ఒక తెల్ల మరుగుజ్జు నక్షత్రం (White Dwarf) ఉంది.

వివరాలు 

'లాంగ్ పీరియడ్ ట్రాన్సియెంట్స్'

ఆస్ట్రేలియాలోని సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ రీసెర్చ్(ICRAR)పరిశోధకుల వివరాల ప్రకారం.. ప్రతి కొన్ని నిమిషాలకు లేదా గంటలకు ఒకసారి రేడియో సంకేతాలను విడుదల చేసే అరుదైన వ్యవస్థల్లో ఇది ఒకటి.

ఇలాంటి వాటిని 'లాంగ్ పీరియడ్ ట్రాన్సియెంట్స్'గా పిలుస్తారు. ఇప్పటివరకు ఇలాంటి వ్యవస్థలు దాదాపు డజను మాత్రమే గుర్తించారు.

ఈ బలమైన రేడియో సంకేతాలు ఎలా ఉత్పత్తి అవుతున్నాయనే విషయం ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదు.

సాధారణంగా ఇలాంటి సంకేతాలు పల్సార్లు,వేగంగా తిరిగే న్యూట్రాన్ నక్షత్రాల నుంచి వెలువడుతుంటాయి.

అయితే తాజాగా గుర్తించిన ఈ ఎనిమిది నిమిషాల సంకేతాలపై పరిశోధనలు చేయడం ద్వారా రేడియో తరంగాలు ఎలా ఏర్పడుతున్నాయనే రహస్యాన్ని ఛేదించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

వివరాలు 

తెల్ల మరుగుజ్జు నక్షత్రం వద్ద ఏం జరుగుతోంది?

ఈ పరిశోధన కోసం పశ్చిమ ఆస్ట్రేలియాలోని సూపర్ కంప్యూటర్ సాయంతో నక్షత్ర వ్యవస్థకు సంబంధించిన 100గంటలకు పైగా రేడియో డేటాను విశ్లేషించారు.

దక్షిణాఫ్రికాలోని మీర్‌క్యాట్ (MeerKAT)రేడియో టెలిస్కోప్‌తో ఈ సంకేతాలను గుర్తించగా.. హవాయిలోని డబ్ల్యూఎం కెక్ అబ్జర్వేటరీ ద్వారా ఆ వ్యవస్థను మరింత లోతుగా పరిశీలించారు.

ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలకు తెల్ల మరుగుజ్జు నక్షత్రం కదలికలను స్పష్టంగా పరిశీలించే అవకాశం లభించింది.

కర్టిన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు,ఈ అధ్యయన ప్రధాన రచయిత సామ్ మెక్‌స్వీనీ మాట్లాడుతూ..తన సహచర నక్షత్రం చుట్టూ తెల్ల మరుగుజ్జు తిరుగుతున్న సమయంలో వెలువడే రేడియో సంకేతాలను ఇంత స్పష్టంగా గుర్తించడం ఇదే తొలిసారని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

తెల్ల మరుగుజ్జు నక్షత్రం వద్ద ఏం జరుగుతోంది?

దీంతో ఈ సంకేతాలు తెల్ల మరుగుజ్జు నక్షత్రానికి దగ్గర్లోని ప్రాంతం నుంచి లేదా ఆ నక్షత్రం నుంచే వెలువడుతున్నాయని అర్థమవుతోందన్నారు.

అంతేకాదు.. ఆ నక్షత్రం ఉపరితలంపై ఏర్పడే భారీ మంటలు, అయస్కాంత క్షేత్రం ప్రభావంతో జరిగే మార్పులను కూడా పరిశోధకులు గుర్తించారు.

నక్షత్రం ఉపరితలం నుంచి భారీగా ప్లాస్మా బయటకు ఎగసిపడే ప్రక్రియను కూడా పరిశీలించారు.

ADVERTISEMENT

వివరాలు 

తెల్ల మరుగుజ్జు నక్షత్రం వద్ద ఏం జరుగుతోంది?

ఈ అంశంపై సహ పరిశోధకురాలు నటాషా హర్లీ-వాకర్ స్పందిస్తూ.. భూమికి 5,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రంపై ఏర్పడే తుపాన్లను రేడియో తరంగాల సాయంతో గుర్తించడం అద్భుతమైన విషయమని పేర్కొన్నారు.

ఈ పరిశోధనతో తెల్ల మరుగుజ్జు నక్షత్రాలపై జరిగే ప్రక్రియల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా,దక్షిణాఫ్రికాలో నిర్మాణంలో ఉన్న స్క్వేర్ కిలోమీటర్ అరే (SKA) టెలిస్కోపుల సాయంతో ఈ నక్షత్ర వ్యవస్థపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ADVERTISEMENT