అంతరిక్ష పరిశోధనల్లో నాసా అద్భుత విజయం: ఆస్టరాయిడ్ శాంపిల్ ని కలెక్ట్ చేసిన స్పేస్ ఏజెన్సీ
ఈ విశాల విశ్వం గురించి తెలుసుకోవాలని మానవుడు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా సౌరకుటుంబం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని మనిషి తాపత్రయ పడుతున్నాడు. ఈ క్రమంలోనే అనేక ప్రయోగాలు చేస్తున్నాడు. అందులో భాగంగా అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా, ఆస్టరాయిడ్ శాంపిల్ ని కలెక్ట్ చేసింది. అపోలో 11 మిషన్ ద్వారా చంద్రుడి నుండి తీసుకొచ్చిన శాంపిల్స్ కాకుండా మొట్టమొదటి సారి ఇతర ఆస్టరాయిడ్స్ నుండి శాంపిల్ కలెక్ట్ చేయడం ఇదే మొదటిసారి. బెన్నూ అనే ఆస్టరాయిడ్ పైకి OSIRIS-REx మిషన్ ని 2016లో నాసా ప్రయోగించింది. ఆ మిషన్ 2020లో బెన్నూని చేరుకుంది. ఇప్పుడు బెన్నూ శాంపిల్ తీసుకుని భూమి మీద ల్యాండ్ అయ్యింది.
ఆస్టరాయిడ్ నుండి 250గ్రాముల దుమ్మును తీసుకొచ్చిన ల్యాండర్
ఆదివారం రోజు అమెరికాలోని ఉటా ప్రాంతంలో ఈ మిషన్ భూమి మీద ఆస్టరాయిడ్ శాంపిల్ తో ల్యాండ్ అయ్యింది. ఆస్టరాయిడ్ దుమ్మును తీసుకొచ్చిన ల్యాండర్ ని ప్రస్తుతం హ్యూస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కి తీసుకువెళ్తున్నారు. అక్కడే, ఈ శాంపిల్ ని పరీక్షించి విశ్లేషిస్తారు. ఈ శాంపిల్ సాయంతో ఏమి తెలుసుకోవచ్చు? ఆస్టరాయిడ్ నుండి తీసుకొచ్చిన 250గ్రాముల దుమ్మును పరిశీలించి సౌరకుటుంబం ఎలా ఏర్పడిందో తెలుసుకునే వీలుంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సౌరకుటుంబం ఎలా ఏర్పడిందో తెలిస్తే, భూమీ మీద జీవం ఎలా ఏర్పడిందన్నది తెలిసే అవకాశం ఉందనీ, అలాగే నివాస యోగ్యంగా భూమి ఎలా మారిందో తెలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.