NASA to ISRO: 'మూన్ బేస్ మిషన్'లో భాగస్వామ్యం కావాలంటూ ఇస్రోకు నాసా ఆహ్వానం
ఈ వార్తాకథనం ఏంటి
అంతరిక్ష రంగంలో భారత్-అమెరికా సహకారం మరింత విస్తరించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రుడిపై పరిశోధనలను కొనసాగిస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తన ప్రతిష్ఠాత్మక 'మూన్ బేస్ మిషన్'లో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2032 నాటికి శాశ్వత మానవ స్థావరం (Lunar Outpost) ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అమెరికా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే చేపట్టనున్న మూన్ బేస్ మిషన్‌లో ఇస్రో భాగస్వామ్యాన్ని నాసా కోరింది. చంద్రుడిపై కీలక పరిశోధనలు నిర్వహిస్తున్న ఇస్రోకు ఈ ఆహ్వానం ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
బెంగళూరులో సమావేశం
ఇండియా-యూఎస్ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఇటీవల బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగింది.
ఈ భేటీలో భారత్, అమెరికా అంతరిక్ష రంగానికి చెందిన ప్రతినిధులు పలు అంశాలపై చర్చించారు.
ఇప్పటికే ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను మరింత పటిష్ఠం చేసుకోవాలని నిర్ణయించారు.
అలాగే శాస్త్రీయ సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం,అంతరిక్ష పరిశోధనల్లో సహకారాన్ని పెంచడం, ఈ రంగానికి సంబంధించిన చర్చలను మరింత వేగవంతం చేయడంపై ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి.
వివరాలు
సాధారణ, వాణిజ్య అంతరిక్ష పరిశోధనలపై దృష్టి
గతేడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సంయుక్త ప్రకటనకు అనుగుణంగా అంతరిక్ష రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించడంపైనా ఇరుదేశాలు దృష్టి సారించాయి.
ముఖ్యంగా సాధారణ, వాణిజ్య అంతరిక్ష పరిశోధనల్లో పరస్పర భాగస్వామ్యాన్ని పెంచుకునే అంశంపై చర్చలు జరిగాయి.
ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ నారాయణన్, అమెరికా రాయబారి సెర్గియో గోర్‌లు ద్వైపాక్షిక అంతరిక్ష సహకారం ప్రాధాన్యతను ప్రస్తావించారు.
భారత్, అమెరికా కలిసి అంతరిక్ష రంగంలో మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.