Loading...
NASA Swift Telescope: నాసా రెస్క్యూ మిషన్ విఫలం.. నవంబర్ 6న భూమిపైకి రానున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ!
నాసా రెస్క్యూ మిషన్ విఫలం.. నవంబర్ 6న భూమిపైకి రానున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ!

NASA Swift Telescope: నాసా రెస్క్యూ మిషన్ విఫలం.. నవంబర్ 6న భూమిపైకి రానున్న స్విఫ్ట్ అబ్జర్వేటరీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష పరిశోధనల్లో సుమారు 22 ఏళ్ల పాటు విశేష సేవలందించిన నాసాకు చెందిన స్విఫ్ట్ అబ్జర్వేటరీ (NASA Swift Observatory) తన చివరి ప్రయాణానికి సిద్ధమైంది. నాసా అంచనాల ప్రకారం.. ఈ ఉపగ్రహం నవంబర్ 6, శుక్రవారం భూమి వాతావరణంలోకి ప్రవేశించనుంది. దీనిని కక్ష్యలోనే కొనసాగించేందుకు నాసా చేపట్టిన రెస్క్యూ మిషన్ విఫలమైంది. దీంతో స్విఫ్ట్ అబ్జర్వేటరీ భూమివైపు తిరిగి రావడం అనివార్యంగా మారింది. 2004లో ప్రయోగించిన ఈ అబ్జర్వేటరీ బరువు సుమారు 1.5 టన్నులు. విశ్వంలో చోటుచేసుకునే అత్యంత శక్తివంతమైన ఖగోళ సంఘటనలను పరిశీలించేందుకు దీనిని ప్రత్యేకంగా రూపొందించారు.

వివరాలు

దాదాపు 1,400 సూపర్‌నోవాలను గుర్తింపు

ముఖ్యంగా గామా-కిరణ విస్ఫోటనాల (Gamma-Ray Bursts) అధ్యయనంలో స్విఫ్ట్ కీలక పాత్ర పోషించింది.

ఇప్పటివరకు ఈ అబ్జర్వేటరీ 2,000కు పైగా గామా-కిరణ విస్ఫోటనాలను, దాదాపు 1,400 సూపర్‌నోవాలను గుర్తించింది.

వీటి పరిశీలన ద్వారా విశ్వం ఆవిర్భావం, నక్షత్రాల అంతం, బ్లాక్ హోల్స్ వంటి అంశాలపై శాస్త్రవేత్తలకు విలువైన సమాచారం అందించింది.

గామా-రే విస్ఫోటనాలు ఎంత శక్తివంతమైనవంటే.. సూర్యుడు తన మొత్తం జీవితకాలంలో విడుదల చేసే శక్తిని అవి కేవలం కొన్ని సెకన్లలోనే విడుదల చేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వివరాలు

కక్ష్య నుంచి బయటకు.. నాసా రెస్క్యూ మిషన్ విఫలం

సుదీర్ఘకాలం భూమి చుట్టూ పరిభ్రమించే ఉపగ్రహాలు వాతావరణంలోని స్వల్ప ఘర్షణ ప్రభావానికి గురవుతుంటాయి.

దీనివల్ల క్రమంగా వాటి వేగం, కక్ష్యలో మార్పులు చోటుచేసుకుని చివరికి కక్ష్యను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.

స్విఫ్ట్ అబ్జర్వేటరీ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంది. అయితే దాని కక్ష్యను మరింత ఎత్తుకు పెంచి, మరికొన్ని సంవత్సరాల పాటు సేవలు అందించేలా చేయాలని నాసా శాస్త్రవేత్తలు భావించారు.

ఇందుకోసం క్యాటలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్(Catalyst Space Technologies) ఃఅనే సంస్థతో 30 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ ప్రణాళికలో భాగంగా 'లింక్' (Link) అనే రోబోటిక్ అంతరిక్ష నౌకను పంపించాలని నిర్ణయించారు. ఆ నౌక స్విఫ్ట్ అబ్జర్వేటరీకి దగ్గరగా వెళ్లి దానిని పట్టుకుని, తిరిగి ఎత్తైన కక్ష్యలోకి చేర్చాల్సి ఉంది.

ADVERTISEMENT

వివరాలు

అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగం

తద్వారా స్విఫ్ట్ మరికొన్నేళ్ల పాటు అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగపడుతుందని భావించారు. కానీ ఆగస్టులో ఈ మిషన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

రోబోటిక్ అంతరిక్ష నౌక స్విఫ్ట్‌కు అవసరమైనంత దగ్గరగా వెళ్లలేకపోయింది. దీంతో రెస్క్యూ మిషన్‌ను కొనసాగించడం సాధ్యం కాలేదు.

చివరకు నాసా ఈ ప్రయత్నాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఫలితంగా స్విఫ్ట్ అబ్జర్వేటరీని కాపాడే అవకాశం లేకుండా పోయింది.

నాసా ప్రస్తుతం స్విఫ్ట్ అబ్జర్వేటరీ కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. నవంబర్ 6న ఇది భూమి వాతావరణంలోకి ప్రవేశించవచ్చని అంచనా వేస్తోంది.

అయితే వాతావరణ పరిస్థితులు, ఉపగ్రహ కక్ష్యలో చోటుచేసుకునే మార్పుల కారణంగా ఇది కచ్చితంగా ఏ సమయంలో, ఏ ప్రాంతంలో వాతావరణంలోకి ప్రవేశిస్తుందో ఇప్పుడే చెప్పడం సాధ్యం కావడం లేదు.

ADVERTISEMENT

వివరాలు

నవంబర్ 6న భూమి వాతావరణంలోకి ప్రవేశం

భూమి వాతావరణంలోకి అత్యంత వేగంతో ప్రవేశించే సమయంలో వాతావరణ ఘర్షణ కారణంగా ఉపగ్రహం తీవ్ర వేడికి గురై ఆకాశంలోనే చాలా వరకు కాలిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే, కొన్ని భాగాలు పూర్తిగా కాలిపోకుండా భూమిని చేరి సముద్రంలో పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ ఉపగ్రహం భూమిపై పడటం వల్ల పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

22 ఏళ్ల పాటు విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ఖగోళ సంఘటనలను పరిశీలించి, కీలక సమాచారాన్ని అందించిన స్విఫ్ట్ అబ్జర్వేటరీ సేవలకు నవంబర్ 6తో ముగింపు పలికే పరిస్థితి ఏర్పడింది.

ADVERTISEMENT