నాసా ప్రయోగం: DART మిషన్ సాయంతో గ్రహశకలంపై బండరాళ్ళ తొలగింపు
హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో నాసా కనుకున్న విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. డైమోర్పోస్ అనే గ్రహశకలాన్ని DART(Double Asteroid Redirection Test) మిషన్ సాయంతో కావాలనే ఢీ కొట్టించారు. దీనివల్ల డైమోర్పోస్ గ్రహశకలంపై ఉన్న బండరాళ్ళు తొలగిపోయి వేరు పడ్డాయి. ఈ విషయాన్ని హబుల్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో కనుక్కున్నారు. డైమోర్పోస్ గ్రహశకలాన్ని ఢీ కొట్టడమనే ప్రక్రియ 2022 సెప్టెంబరులో జరిగింది. సెప్టెంబర్ 26వ తేదీన డైమోర్పోస్ గ్రహశకలాన్ని 22,530km/hr వేగంతో DART అంతరిక్ష నౌక ఢీకొట్టింది. ఈ తాకిడి కారణంగా తన పేరెంట్ గ్రహశకలం చుట్టూ తిరిగే కక్ష్యలో మార్పు మార్పు వచ్చి 32నిమిషాలు తగ్గిందని నాసా పేర్కొంది.
భూమి మీదకు వచ్చే గ్రహశకలాలను మళ్ళించడం సాధ్యమే
గ్రహశకలం నుండి తొలగిపోయిన బండరాళ్ళు 3అడుగుల నుండి 22అడుగుల వెడల్పులో ఉన్నట్లు, అలాగే మొత్తం 37బండరాళ్ళు ఉన్నట్లు నాసా తెలిపింది. అయితే ఈ బండరాళ్ళు గ్రహశకలం నుండి పగిలిపోయిన భాగాలు కావని నాసా చెబుతోంది. గ్రహశకలం ఉపరితలం మీద పడి ఉన్న బండరాళ్ళే ఇలా తొలగిపోయాయని నాసా పేర్కొంది. ఈ ప్రయోగం వల్ల భవిష్యత్తులో భూమిని ఢీకొట్టబోయే గ్రహశకలాను తప్పించే అవకాశం ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. డైమోర్పోస్ ఉపరితలం నుండి దాదాపు 160అడుగుల వెడల్పులో బండరాళ్ళు తొలగిపోయి ఉంటాయని నాసా సైంటిస్ట్ జ్యూవిట్ అన్నారు.