NASA: అంగారకుడి వైపు దూసుకెళ్తున్న నాసా 'ఎస్కపేడ్' మిషన్.. న్యూ గ్లెన్ లాంచ్ విజయవంతం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) చేపట్టిన ప్రతిష్టాత్మక మార్స్ మిషన్ 'ఎస్కపేడ్' (ESCAPADE) విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. ఈ మిషన్‌ను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ (Blue Origin) తన భారీ రాకెట్ 'న్యూ గ్లెన్' (New Glenn) ద్వారా అంతరిక్షంలోకి పంపింది. వాతావరణ సమస్యలు, సౌర తుఫాన్లు కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ ప్రయోగం ఎట్టకేలకు గురువారం ఫ్లోరిడాలోని కేప్ కెనవెరల్ స్పేస్ స్టేషన్ నుండి విజయవంతంగా లాంచ్ అయింది. అనంతరం 'న్యూ గ్లెన్' రాకెట్ సురక్షితంగా భూమికి తిరిగి చేరి రీయూజబుల్ టెక్నాలజీలో మరో మైలురాయిని నమోదు చేసింది.
Details
రెండు ఉపగ్రహాలతో ప్రత్యేకమైన మిషన్
'ఎస్కపేడ్' మిషన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒకే ప్రయోగంలో 'బ్లూ', 'గోల్డ్' అనే రెండు ఉపగ్రహాలను అంగారకుడి వైపునకు పంపడం. ఈ ఉపగ్రహాలు మార్స్ వాతావరణాన్ని సవివరంగా అధ్యయనం చేస్తాయి. ముఖ్యంగా — అంగారక గ్రహం తన వాతావరణాన్ని ఎలా కోల్పోయింది? మార్స్ పరిణామం, నివాసయోగ్యతకు సంబంధించిన మార్పులు ఏమిటి? అనే అంశాలపై కీలక సమాచారాన్ని సేకరించనున్నాయి. అంతేకాకుండా మార్స్‌లోని అయస్కాంత క్షేత్రం, ప్లాస్మా వాతావరణం వంటి కోట్లు సంవత్సరాల నాటి గూఢతత్వాలను వెలికి తీసేందుకు ఈ రెండు ఉపగ్రహాలు పనిచేస్తాయి. 'ఎస్కపేడ్' వాహక నౌక మొదట భూ కక్షలో సుమారు ఒక సంవత్సరం ప్రయాణించి 2027నాటికి మార్స్ కక్షలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచే బ్లూ, గోల్డ్ ఉపగ్రహాలు తమ పని ప్రారంభించనున్నాయి.
Details
స్పేస్‌ఎక్స్‌కు ప్రత్యర్థిగా బ్లూ ఆరిజిన్
ప్రయోగం తర్వాత 'న్యూ గ్లెన్' రాకెట్ అట్లాంటిక్ సముద్రంలోని రికవరీ షిప్ 'జాక్లైన్'పై సురక్షితంగా దిగింది. రీయూజ్ టెక్నాలజీని విజయవంతంగా ప్రదర్శించడం ద్వారా ఈ రాకెట్ స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ సిరీస్‌కు బ్లూ ఆరిజిన్ నుండి వచ్చిన నిజమైన పోటీగా నిలిచింది. ఇప్పటి వరకు రాకెట్లను పునర్వినియోగం చేసే సామర్థ్యం స్పేస్‌ఎక్స్‌కే ఉండగా, ఈ ప్రయోగంతో బ్లూ ఆరిజిన్ కూడా ఆ ర్యాంక్ చేరింది. ఈ ప్రయోగం నాసా-బ్లూ ఆరిజిన్‌లకు మాత్రమే కాదు, అంతరిక్ష పరిశోధనలకు కూడా కొత్త శకానికి నాంది పలికే ఘట్టంగా నిలిచింది.