LOADING...
NASA's Parker Solar Probe: సౌర కరోనాలోకి మరోసారి విజయవంతంగా ప్రవేశించిన పార్కర్‌ ప్రోబ్‌..  
సౌర కరోనాలోకి మరోసారి విజయవంతంగా ప్రవేశించిన పార్కర్‌ ప్రోబ్‌..

NASA's Parker Solar Probe: సౌర కరోనాలోకి మరోసారి విజయవంతంగా ప్రవేశించిన పార్కర్‌ ప్రోబ్‌..  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2025
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

చండప్రచండ నిప్పులు కురిపించే సూర్యుడి వద్దకు పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ అతి వేగంగా చేరి మళ్లీ తిరిగొచ్చింది. భానుడి గురించి లోతైన పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2018లో అంతరిక్షంలోకి పంపిన ఈ ప్రత్యేక యంత్రం తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించింది. ఇటీవల భానుడికి అత్యంత సమీపంగా చేరిన ఈ ప్రోబ్‌ గంటకు 6,87,000 కి.మీ. వేగంతో ప్రయాణించింది. ఈ వేగం ఎంత విపరీతమో చెప్పాలంటే, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారికి కేవలం 19 సెకన్లలోనే చేరుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.

వివరాలు 

సూర్యుడి వద్ద ఉండే భారీ స్థాయి గురుత్వాకర్షణ శక్తి

ఇప్పటికే పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ మూడుసార్లు ఇలాంటి గరిష్ట వేగాన్ని సాధించింది. ఇది సాధ్యమవడానికి ప్రధాన కారణం సూర్యుడి వద్ద ఉండే భారీ స్థాయి గురుత్వాకర్షణ శక్తి. కక్ష్యలో పరిభ్రమిస్తూ, తరచూ భానుడికి చేరువయ్యే ఈ వ్యోమనౌక, సూర్యుని నుంచి వెలువడే సౌర గాలులు, జ్వాలలు, తుపాన్ల వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని సేకరిస్తోంది. ఇవి భవిష్యత్తులో వ్యోమగాములకు, ఉపగ్రహాలకు, అలాగే విద్యుత్‌ గ్రిడ్‌లకు ముప్పు కలిగించే అవకాశం ఉన్నందున, పార్కర్‌ సేకరించే డేటా ద్వారా అంతరిక్ష వాతావరణానికి సంబంధించిన ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం సాధ్యమవుతుంది.

వివరాలు 

సూర్యుని ఉగ్ర వేడిని తట్టుకోగలిగే ప్రత్యేక కార్బన్‌ ఫోమ్‌ కవచం 

ఇటీవల సెప్టెంబర్‌ 10 నుంచి 20 మధ్యకాలంలో పార్కర్‌ ప్రోబ్‌ సూర్యుడి కరోనాలోకి ప్రవేశించి విజయవంతంగా బయటకు వచ్చింది. ఈ ప్రయాణంలో తన పరికరాలకు ఎటువంటి నష్టం జరగలేదని సంకేతాలను నాసాకు పంపించింది. అంతకుముందు జూన్‌ 19న కూడా ఈ యంత్రం కరోనాలోకి ప్రవేశించింది. ఆ సమయంలో ఇది సూర్య ఉపరితలానికి గరిష్ఠంగా 38 లక్షల కిలోమీటర్ల దూరం వరకూ చేరుకుంది. సూర్యుని ఉగ్ర వేడిని తట్టుకోగలిగే ప్రత్యేక కార్బన్‌ ఫోమ్‌ కవచాన్ని ఈ ప్రోబ్‌లో అమర్చడం వల్లే ఇంతటి సాహసం సాధ్యమైంది.