LOADING...
NASA: చంద్రయానాలకు కొత్త ఊతం.. అరుదైన మెటీరియల్‌ను కనుగొన్న నాసా శాస్త్రవేత్తలు
చంద్రయానాలకు కొత్త ఊతం.. అరుదైన మెటీరియల్‌ను కనుగొన్న నాసా శాస్త్రవేత్తలు

NASA: చంద్రయానాలకు కొత్త ఊతం.. అరుదైన మెటీరియల్‌ను కనుగొన్న నాసా శాస్త్రవేత్తలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2026
09:32 am

ఈ వార్తాకథనం ఏంటి

భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసాల ఏర్పాటుకు, అంతరిక్ష యాత్రికుల సామగ్రి భారాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే కొత్త పదార్థాన్ని (మెటీరియల్) నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ చంద్రుడి ఉపరితలంలోనే లభ్యమయ్యే వనరులను వినియోగించి మౌలిక సదుపాయాల నిర్మాణం, మానవ అన్వేషణ కార్యక్రమాలను మరింత సులభతరం చేయగలదని నాసా వెల్లడించింది. ప్రస్తుతం చంద్రుడి రాళ్ల నుంచి లోహాలు, ఆక్సిజన్‌ను వెలికితీసి నిర్మాణాలు, ఇంధనం, జీవనాధార వ్యవస్థల కోసం వినియోగించే మార్గాలపై నాసా పరిశోధనలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో ఉన్న నాసా గ్లెన్ రీసెర్చ్ సెంటర్‌లో నిర్వహించిన అధ్యయనంలో ఈ కొత్త పదార్థం వెలుగులోకి వచ్చింది.

వివరాలు

ప్రయోగాలతో ఫలితం

నాసా స్పేస్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ప్రోగ్రామ్‌లో భాగంగా డాక్టర్ కెవిన్ యూ, గ్లెన్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన మెటీరియల్స్ ఇంజినీర్ డాక్టర్ జేమ్సా స్టోక్స్‌తో కలిసి చంద్రుడి ధూళి (లూనార్ డస్ట్) కరిగిన స్థితిలో వివిధ పదార్థాలతో ఎలా ప్రతిస్పందిస్తుందో పరిశీలించారు. పరిశోధన ప్రారంభమైన దాదాపు ఆరు నెలల తర్వాత శాస్త్రవేత్తలకు ఊహించని ఫలితం ఎదురైంది. చంద్రుడి ధూళిని పోలిన కృత్రిమ పదార్థాన్ని స్కాండియం ఆక్సైడ్‌తో కలిపి అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయగా, ఇప్పటివరకు ఎప్పుడూ గుర్తించని కొత్త పదార్థం ఏర్పడింది.

వివరాలు

లక్షల పదార్థాల డేటాబేస్‌లోనూ కనిపించలేదు

ఈ ఫలితాలను పలుమార్లు పరీక్షించిన పరిశోధకులు, తమ ఎక్స్‌రే విశ్లేషణ డేటాబేస్‌లో నమోదైన 10 లక్షలకు పైగా పదార్థాలతో పోల్చిచూశారు. అయితే ఈ కొత్త పదార్థం ఏదికీ సరిపోలకపోవడంతో, దాని రసాయనిక నిర్మాణాన్ని మొదటి నుంచి విశ్లేషించడం ప్రారంభించారు. మరిన్ని పరీక్షల కోసం ఎనిమిది ప్రాథమిక ఆక్సైడ్ పదార్థాలను ఇథైల్ ఆల్కహాల్‌లో కలిపి ప్రత్యేక ప్రయోగశాల పరికరాలతో మిశ్రమాన్ని సిద్ధం చేశారు. అనంతరం దానిని 2,900 డిగ్రీల ఫారన్‌హీట్‌కు పైగా ఉష్ణోగ్రత వద్ద వేడి చేశారు.

Advertisement

వివరాలు

స్ట్రాబెర్రీ మిల్క్‌లా కనిపించిన పదార్థం

ఈ కొత్త పదార్థం తొలుత గులాబీ రంగు పొడి రూపంలో కనిపించిందని డాక్టర్ కెవిన్ యూ తెలిపారు. అది స్ట్రాబెర్రీ మిల్క్‌ను పోలి ఉందని చెప్పారు. తరువాత ఆ పొడి లేత గోధుమరంగులోకి మారడం ద్వారా రసాయనిక ప్రతిచర్య విజయవంతమైనట్లు నిర్ధారించుకున్నామని వివరించారు.

Advertisement

వివరాలు

అత్యంత వేడినీ తట్టుకునే సామర్థ్యం

పరిశోధనల్లో ఈ కొత్త పదార్థం కరిగిన చంద్ర ధూళి వల్ల కలిగే తుప్పును నిరోధించగలదని, చంద్రుడి రాళ్లను కరిగించేందుకు అవసరమైన అత్యధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకోగలదని తేలింది. సాధారణ వంటగది ఓవెన్‌లో ఉండే ఉష్ణోగ్రత కంటే ఆరు రెట్లు ఎక్కువ వేడిని ఇది భరించగలదు. ఈ పదార్థంలో స్కాండియం ఆక్సైడ్ ఉపయోగించినప్పటికీ, అధిక ఉష్ణోగ్రతల కోసం ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాటినం వంటి విలువైన లోహాలతో పోలిస్తే దీని తయారీ ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

వివరాలు

చంద్రుడి వనరుల వినియోగంలో కీలక పాత్ర

భవిష్యత్తులో చంద్రుడి రాళ్ల నుంచి ఉపయోగకరమైన వనరులను వెలికితీసే నాసా సాంకేతికతల్లో ఈ కొత్త పదార్థం కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా కరిగిన చంద్ర ధూళిని నిల్వ చేసే పైపులు, కంటైనర్ల తయారీలో దీనిని వినియోగించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతేకాకుండా, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే జెట్ ఇంజిన్ల లోపలి భాగాల్లో రక్షణ పూతగా కూడా ఈ పదార్థాన్ని ఉపయోగించవచ్చని గుర్తించారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక కోటింగ్ పదార్థాలతో పోలిస్తే ఇది తక్కువ బరువు, తక్కువ సాంద్రత కలిగి ఉండటమే కాకుండా మెరుగైన ఉష్ణ నిరోధకతను అందిస్తుందని వెల్లడించారు.

వివరాలు

మరింత మెరుగుదలపై దృష్టి

ప్రాథమిక పరీక్షలు పూర్తయినప్పటికీ, ఈ పదార్థం స్వచ్ఛతను పెంచడం, తయారీ వ్యయాన్ని మరింత తగ్గించడం లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు కొనసాగించాలని డాక్టర్ కెవిన్ యూ, డాక్టర్ జేమ్సా స్టోక్స్ భావిస్తున్నారు. చంద్రుడు మాత్రమే కాకుండా భూమికి అవతల ఉన్న క్లిష్టమైన అంతరిక్ష వాతావరణాల్లో మానవ అన్వేషణను ముందుకు తీసుకెళ్లడంలో మెటీరియల్స్ సైన్స్ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

Advertisement