NASA Voyager 1: భూమి నుంచి లైట్-డే దూరానికి వాయేజర్-1.. నాసా అరుదైన ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణిస్తున్న నాసా వాయేజర్-1 మరో చారిత్రక మైలురాయిని చేరుకోబోతోంది. బుధవారం ఈ అంతరిక్ష నౌక భూమికి సుమారు 25.9 బిలియన్ కిలోమీటర్ల దూరంలోకి వెళ్లనుంది. ఇంత దూరంలో ఉన్న వాయేజర్-1కు భూమి నుంచి పంపిన రేడియో సిగ్నల్ చేరేందుకు ఏకంగా 24 గంటలు పడుతుంది. ఈ దూరాన్నే 'ఒక లైట్-డే' అంటారు. అంటే మనిషి తయారు చేసిన వస్తువుల్లో భూమికి అత్యంత దూరంగా ఉన్న వాయేజర్-1 మరో అరుదైన ఘనతను నమోదు చేయనుంది.
Details
లైట్-డే అంటే ఏంటి?
లైట్-డే అంటే కాంతి ఒక రోజులో ప్రయాణించే దూరం. కాంతి సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
24 గంటల్లో అది చేరే దూరం సుమారు 25.9 బిలియన్ కిలోమీటర్లు. ఈ మైలురాయిని వాయేజర్-1 ఉదయం 5:16:07 EST సమయంలో చేరుకుంటుందని నాసా తెలిపింది.
అక్కడి నుంచి వాయేజర్ పంపే సమాధానం భూమికి చేరేందుకు మరో 24 గంటలు పడుతుంది. అంటే ఒక సందేశానికి ప్రశ్న, సమాధానం కలిపి దాదాపు 48 గంటల సమయం పడుతుంది.
Details
1977లో మొదలైన ప్రయాణం
వాయేజర్-1ను 1977 సెప్టెంబర్ 5న అమెరికాలోని కేప్ కెనవెరల్ నుంచి ప్రయోగించారు. తొలుత గురుడు, శని గ్రహాలను అధ్యయనం చేయడమే దీని లక్ష్యం.
1979లో గురుడు, 1980లో శని గ్రహాలను దాటిన తర్వాత ఇది సౌర వ్యవస్థ వెలుపలికి ప్రయాణం కొనసాగించింది.
2012 ఆగస్టులో హీలియోపాజ్‌ను దాటి ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించిన తొలి మానవ నిర్మిత వస్తువుగా నిలిచింది. ప్రస్తుతం గంటకు దాదాపు 61,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.
Details
గోల్డెన్ రికార్డ్ కూడా వెంటనే..
వాయేజర్-1 ప్రయాణంలో మరో ఆసక్తికరమైన విషయం దాని వెంట ఉన్న గోల్డెన్ రికార్డ్. 12 అంగుళాల బంగారు పూతతో కూడిన కాపర్ డిస్క్‌లో భూమిపై జీవితం, మనుషుల సంస్కృతిని ప్రతిబింబించే శబ్దాలు, చిత్రాలు, 55 భాషల్లో శుభాకాంక్షలు, సంగీతం ఉన్నాయి.
భవిష్యత్తులో ఎవరైనా ఈ అంతరిక్ష నౌకను గుర్తిస్తే భూమి గురించి తెలుసుకునేందుకు ఇది ఒక చిన్న సందేశంలా మిగులుతుంది.
వాయేజర్-1 ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉండటం అంతరిక్ష చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.