Page Loader
Glioblastoma: ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌.. గంటలో నిర్దారించే కొత్త రక్త పరీక్ష 
ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌.. గంటలో నిర్దారించే కొత్త రక్త పరీక్ష

Glioblastoma: ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌.. గంటలో నిర్దారించే కొత్త రక్త పరీక్ష 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2024
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

శాస్త్రవేత్తలు మెదడు క్యాన్సర్‌లోని అత్యంత ప్రమాదకరమైన రకం గ్లియోబ్లాస్టోమాను వేగంగా గుర్తించే కొత్త పద్ధతిని కనుగొన్నారు. కేవలం ఒక గంటలోనే ఈ పరికరం వ్యాధిని నిర్ధారించగలదని చెబుతున్నారు. రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తించేందుకు నాట్రదామ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక ఆటోమేటెడ్‌ పరికరాన్ని అభివృద్ధి చేశారు. సాధారణంగా, క్యాన్సర్‌ కణాలను నిర్ధారించడానికి కణజాలాన్ని సేకరించి పరీక్షించాల్సి వస్తుంది.దీనికి చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం కూడా పడుతుంది. అయితే, రక్త పరీక్ష (లిక్విడ్ బయోప్సీ) ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు సరికొత్త పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరంలో ఉండే ప్రత్యేకమైన బయోచిప్‌ గ్లియోబ్లాస్టోమాకు కారణమైన ఈజీఎఫ్‌ఆర్‌ వంటి కణాలను గుర్తిస్తుంది.

వివరాలు 

గ్లియోబ్లాస్టోమా ఏమిటి? 

రక్తంలో క్రియాశీలంగా ఉండే ఈ కణాలను గుర్తించేందుకు ఈ సాంకేతికత ఎంతో సహాయపడుతుందని నాట్రదామ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ సూ-చియా చాంగ్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ పరికరం ప్రయోగ దశలో ఉన్నప్పటికీ, పూర్తిగా అందుబాటులోకి వచ్చినప్పుడు దీని ధర రూ. 168 కంటే తక్కువగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లియోబ్లాస్టోమా అనేది మెదడు క్యాన్సర్‌లో అత్యంత వేగంగా వ్యాపించే రకం. దీనికి సమర్థవంతమైన చికిత్స లభించదు. వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత బాధితులు సాధారణంగా 12 నుంచి 18 నెలల వరకు మాత్రమే జీవించే అవకాశం ఉంటుంది. అయితే, కీమోథెరపీ వంటి చికిత్సలు ఉపయోగించి, వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు బాధితులు కొంతకాలం ఎక్కువగా జీవించే అవకాశాన్ని పరిశోధకులు అందిస్తున్నారు.