Loading...
Instagram for TV: ఇక టీవీలోనూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. భారత్‌లోకి కొత్త యాప్!
ఇక టీవీలోనూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. భారత్‌లోకి కొత్త యాప్!

Instagram for TV: ఇక టీవీలోనూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్.. భారత్‌లోకి కొత్త యాప్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు మొబైల్ ఫోన్ స్క్రీన్‌కే పరిమితమైన ఇన్‌స్టాగ్రామ్‌ను ఇకపై ఇంటిల్లిపాదీ కలిసి టీవీలోనూ వీక్షించొచ్చు. ఇందుకోసం రూపొందించిన 'ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ' (Instagram for TV) యాప్‌ను త్వరలో భారత్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెటా ప్రకటించింది. ఇప్పటికే అమెరికాలోని కొన్ని అమెజాన్ ఫైర్ టీవీల్లో ఈ యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ వినియోగం మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లకే పరిమితమైంది. కొత్త యాప్ అందుబాటులోకి వస్తే స్మార్ట్ టీవీల్లోనూ రీల్స్, స్టోరీలను వీక్షించవచ్చు. నచ్చిన కంటెంట్ క్రియేటర్ల వీడియోలను టీవీ రిమోట్‌తోనే సులభంగా స్క్రోల్ చేయొచ్చు. అంతేకాదు.. ప్రతిసారీ రిమోట్‌తో స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా రీల్స్ ఆటోమేటిక్‌గా ప్లే అవుతాయి.

వివరాలు

ఈ టీవీల్లోనే యాప్‌కు సపోర్ట్

'ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ' యాప్ యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ డివైజ్‌లకు మాత్రమే సపోర్ట్ చేయనుంది.

ఇందుకోసం టీవీలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఒక టీవీలో గరిష్ఠంగా ఐదు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కనెక్ట్ చేసుకోవచ్చు.

తమ ప్రైమరీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను టీవీకి కనెక్ట్ చేయడం ఇష్టం లేని వారు.. టీవీ కోసమే ప్రత్యేకంగా మరో ఖాతాను క్రియేట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

యూజర్ల ఆసక్తులకు అనుగుణంగా ప్రత్యేక ఛానెల్స్‌ను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో నచ్చిన క్రియేటర్ల ప్రొఫైల్స్‌ను చూడటం, స్టోరీలను వెతకడం మరింత సులభం కానుంది.

వివరాలు

ఫోన్‌లోని రీల్‌ను టీవీలో చూడొచ్చు

ఈ యాప్‌లో 'క్యాస్ట్ వీడియోస్' అనే ఆప్షన్ కూడా ఉంటుంది.

దీని ద్వారా ఫోన్‌లో నచ్చిన రీల్‌ను నేరుగా టీవీకి పంపి పెద్ద స్క్రీన్‌పై వీక్షించవచ్చు.

అయితే ఇందుకోసం ఫోన్, టీవీ రెండూ ఒకే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలి.

ADVERTISEMENT