Nvidia: ఏఐ దూకుడుకు కళ్లెం.. భద్రత కోసం ఎన్విడియా కొత్త టూల్ ఆవిష్కరణ
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ దిగ్గజం, చిప్‌మేకర్ నివిడియా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భద్రతకు సంబంధించి కీలక ముందడుగు వేసింది. ఏఐ ఏజెంట్లు అదుపు తప్పి వ్యవహరించకుండా పర్యవేక్షించేందుకు కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. 'ఎన్విడియా ఓపెన్ ఏజెంట్ సేఫ్టీ ప్లాట్‌ఫామ్' పేరుతో ఈ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 100కు పైగా పరిశ్రమ భాగస్వాములతో కలిసి దీనిని అభివృద్ధి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ప్లాట్‌ఫామ్ ఏఐ ఏజెంట్లు చేపట్టే కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. కంపెనీ నిర్దేశించిన నిబంధనలు, పరిమితులను అవి ఉల్లంఘించకుండా చూసేలా దీన్ని రూపొందించారు. ఏఐ సామర్థ్యాలు మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో భద్రతకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ పేర్కొన్నారు.
వివరాలు
భద్రతపై భిన్నాభిప్రాయాలు
ఏఐ భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించినప్పుడే సమాజం దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోగలదని తెలిపారు.
ఏఐ సామర్థ్యాల సరిహద్దులను తెలుసుకుంటున్న కొద్దీ.. భద్రత విషయంలోనూ ఆవిష్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇటీవల కొన్ని ఏఐ వ్యవస్థలు స్పష్టమైన ఆదేశాలు లేకుండానే కార్పొరేట్, ప్రభుత్వ వ్యవస్థల్లోకి ప్రవేశించినట్లు పలు వార్తలు వెలువడ్డాయి.
ఓపెన్ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్లు అమెరికా ప్రభుత్వ వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకున్నాయన్న నివేదికలు కూడా ఆందోళనకు దారితీశాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ తదితరులు ఏఐపై కఠినమైన నియంత్రణలు అవసరమని అభిప్రాయపడ్డారు.
వివరాలు
రికార్డు స్థాయిలో షేర్ బైబ్యాక్
అయితే ఏఐపై కఠిన నియంత్రణలు అవసరమన్న వాదనతో జెన్సన్ హువాంగ్ విభేదిస్తున్నారు.
ఏఐ మానవాళికి పెను ముప్పుగా మారుతుందన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు.
అదే సమయంలో నియంత్రణలు పరిశ్రమ అభివృద్ధికి అడ్డంకిగా మారకూడదని అభిప్రాయపడ్డారు.
తమ సంస్థ అదుపు తప్పుతోందని ఏదైనా కంపెనీ భావిస్తే.. ముందుగా ఆ కంపెనీనే నియంత్రణలోకి తీసుకురావాలని ఆయన సీఎన్ఎన్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఎన్విడియా భారీ షేర్ బైబ్యాక్ ప్రకటన చేసింది. కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద షేర్ బైబ్యాక్ కార్యక్రమాన్ని ప్రకటించింది.
ఏకంగా 150 బిలియన్ డాలర్ల విలువైన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే అమల్లో ఉన్న 85 బిలియన్ డాలర్ల షేర్ బైబ్యాక్ కార్యక్రమానికి ఇది అదనం.
వివరాలు
రికార్డు స్థాయిలో షేర్ బైబ్యాక్
గతంలో ఆపిల్ ప్రకటించిన 110 బిలియన్ డాలర్ల షేర్ బైబ్యాక్ రికార్డును ఎన్విడియా తాజా ప్రకటన అధిగమించింది.
కంపెనీ వద్ద భారీగా నగదు నిల్వలు ఉండటం, భవిష్యత్తులో వ్యాపార అవకాశాలపై సంస్థకు ఉన్న నమ్మకానికి ఈ నిర్ణయం ప్రతిబింబమని ఎన్విడియా తెలిపింది.
ప్రస్తుతం ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు 5.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
అయితే ఏఐ భద్రతా టూల్ ఆవిష్కరణ, భారీ షేర్ బైబ్యాక్ ప్రకటన వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నప్పటికీ.. ప్రీ-మార్కెట్ ట్రేడింగ్‌లో ఎన్విడియా షేర్లు స్వల్పంగానే లాభపడ్డాయి.