లక్షకుపైగా చాట్‌జీపీటీ యూజర్ల పర్సనల్ డేటా హ్యాక్.. డార్క్ వెబ్‌సైట్లలో అమ్మకానికి పెట్టిన హ్యాకర్లు
ప్రస్తుత ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ మంచి ఆదరణ పొందుతోంది. మరోవైపు తాజాగా లక్ష మందికిపైగా చాట్‌జీపీటీ యూజర్ల సమాచారం పై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. చాట్‌జీపీటీ పేరుతో ఇప్పటికే విచ్చలవిడిగా నకిలీ యాప్స్ యూజర్లను బోల్తా కొట్టిస్తున్నాయి. ఆయా యూజర్లంతా సైబర్ దాడుల బారిన పడ్డారని ఓ తాజా పరిశోధన నివేదిక సంచలన ప్రకటన చేసింది. ఇటీవలే ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ నిక్షిప్తం చేసిన చాట్‌జిపిటి వివరాలను, హ్యాకర్లు 1,01,134 పరికరాలకు సంబంధించి డేటా చోరీలకు పాల్పడ్డట్లు సదరు నివేదిక కుండబద్దలు కొట్టింది.
కీలక చాట్‌జీపీటీ విషయాలు బహిర్గతంతో ఫిషింగ్ అటాక్ రిస్క్
దీంతో కీలక యూజర్లకు సంబంధించిన మెయిల్, పాస్‌వర్డ్స్, ఫోన్ నెంబర్ తదితర కీలక విషయాలతో ఫిషింగ్ అటాక్ రిస్క్ బారిన పడ్డాయని రిపోర్ట్ వెల్లడించింది. గడిచిన ఏడాదిగా చాట్‌జీపీటీ వినియోగదారుల పర్సనల్ డేటాను హ్యాకర్లు డార్క్ వెబ్ మార్కెట్ ప్లేస్‌ల్లో అమ్మకానికి పెట్టారని సైబర్ సెక్యరిటీ సంస్ధ తేల్చి చెప్పింది. భద్రతా పరంగా లోటు పాట్లు ఎదుర్కొంటున్న చాట్‌జీపీటీ అకౌంట్లకు సంబంధించి భారతదేశం ముందు వరుసలో నిలుస్తోందని పరిశోధన నివేదిక తేటతెల్లం చేసింది. యూజర్ల వివరాలను చోరీ చేసేందుకు హ్యాకర్లు ఇన్ఫో స్టీలింగ్ అనే మాల్‌వేర్‌ను ప్రయోగించారని గ్రూప్-ఐబీ తన రీసెర్చ్ బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది.
బ్రౌజింగ్ హిస్టరీ డేటాను ఇన్ఫో స్టీలింగ్ మాల్‌వేర్ సేకరిస్తోంది
మాల్‌వేర్ బారిన పడ్డ డివైజ్‌ల నుంచి బ్రౌజర్లలో నిక్షిప్తం చేసిన బ్యాంక్ వివరాలు, క్రిప్టో వాలెట్ డేటా, కుకీస్, బ్రౌజింగ్ హిస్టరీ డేటాను ఇన్ఫో స్టీలింగ్ మాల్‌వేర్ సేకరిస్తోందని గ్రూప్-ఐబీ పరిశోధన నివేదిక చెప్పింది. యూజర్ ఫిషీ లింక్స్‌ను యూజర్లు పొరపాటున క్లిక్ చేసినా లేదా మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసినా మాల్‌వేర్ డౌన్‌లోడ్ అవుతుందని తెలిపింది. మరోవైపు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని యూజర్లూ అధికంగానే సైబర్ క్రైమ్ బారిన పడుతున్నట్లు వెల్లడించింది. భారత్‌లోనూ 12 వేల 632 చాట్‌జీపీటీ ఖాతాలు డేటా చోరీకి గురయ్యాయని పేర్కొంది. పాక్ లోని 9 వేల 217 యూజర్లు దీన్ని ఎదుర్కొంటున్నారు. బ్రెజిల్, వియత్నాం, ఈజిప్ట్ చాట్‌జీపీటీ యూజర్ల డేటా భద్రతా ఉల్లంఘనలకు గురైందని నివేదిక చెప్పుకొచ్చింది.