WhatsApp : వాట్సాప్ నుంచే ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్ట్రేషన్.. కొత్త సేవ ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ప్రభుత్వ పౌర సహాయక సేవా వ్యవస్థ 'మన మిత్ర' వాట్సాప్ సేవల ద్వారా ఇప్పుడు ఆరోగ్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. 9552300009 నంబర్‌కు వాట్సప్‌లో 'హాయ్' అని మెసేజ్ పంపితే, ఆరోగ్య సేవలకు సంబంధించిన మెనూ వినియోగదారుల ముందు తెరుచుకుంటుంది. ఇందులో ఉన్న ఆప్షన్ల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను సులభంగా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ మెనూలో 'ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్‌మెంట్ సేవలు (ఓఆర్‌ఎస్)' ఎంపికను తీసుకుంటే జిల్లా, ఆసుపత్రి, విభాగం వంటి వివరాలు చూపిస్తాయి.
Details
sl
ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్, చిరునామా, పిన్‌కోడ్, జిల్లా, రాష్ట్రం వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది. ఆ టోకెన్‌లోని చివరి నాలుగు అంకెలను నమోదు చేస్తే అపాయింట్‌మెంట్ బుక్ అవుతుంది. ఈ విధంగా పొందిన అపాయింట్‌మెంట్ ఆధారంగా కేటాయించిన సమయంలో ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించి చికిత్స పొందవచ్చు.
Details
గతంలో ఆస్పత్రికి వెళ్లి ఓపీ తీసుకోవాలి
సాధారణంగా అయితే రోగి లేదా వారి బంధువులు ఆసుపత్రికి వెళ్లి ఓపీ టోకెన్ కోసం క్యూలో నిలబడాల్సి ఉంటుంది. వైద్యుడిని కలిసిన తర్వాత మందుల కోసం మరోసారి క్యూలో వేచి ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆ రోజు సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్ అందుబాటులో ఉన్నారా? మందులు ఉన్నాయా? అనే విషయాలు ముందుగా తెలియకపోవడం వల్ల ఆసుపత్రికి వెళ్లినా పనులు పూర్తి కాకపోయే పరిస్థితులు ఎదురవుతుంటాయి.
Details
రక్త నిల్వలు, మందుల వివరాలు కూడా
మన మిత్ర సేవలో ఆరోగ్య శాఖకు సంబంధించిన మరో ముఖ్యమైన సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. 'రక్త నిల్వలు' అనే ఆప్షన్‌ను ఎంచుకుని జిల్లా పేరు నమోదు చేస్తే ఏ, బీ, ఏబీ, ఓ, ఓహెచ్ రక్త గ్రూపుల పాజిటివ్, నెగెటివ్ రకాల నిల్వలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో సమాచారం లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ సమాచారంతో వెంటనే అవసరమైన సేవలను పొందవచ్చు. అదేవిధంగా ఔషధాలు మరియు శస్త్రచికిత్స సామగ్రి లభ్యత వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం జిల్లా, ఆసుపత్రి వివరాలను నమోదు చేస్తే సంబంధిత ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్ సామగ్రి నిల్వల సమాచారం వినియోగదారులకు అందుతుంది.
Details
ఆరోగ్య కార్డు సేవలు
మన మిత్ర వాట్సప్‌లో 'ఆరోగ్య కార్డు సేవలు' అనే ఎంపికను తీసుకుంటే ఎన్టీఆర్ వైద్య సేవా ఆరోగ్య కార్డుకు సంబంధించిన సేవలు కనిపిస్తాయి. ఇందులో ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు అప్‌డేట్ చేయడం, కార్డు ప్రస్తుత స్థితిని తెలుసుకోవడం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. అవసరమైతే ఫిర్యాదు నమోదు చేసి అవసరమైన పత్రాలను కూడా అప్‌లోడ్ చేయవచ్చు. ఇదే సేవ ద్వారా జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవల వివరాలను కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది.
Details
డిజిటల్ ఆరోగ్య రికార్డులు
ప్రజల ఆరోగ్య వివరాలను డిజిటల్‌గా భద్రపరిచేందుకు ప్రభుత్వం 'ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం)' కింద ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 'నో యువర్ ఆభా' అనే ఆప్షన్‌ను ఎంచుకుని మొబైల్, ఆధార్ నంబర్లు నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో లాగిన్ అయిన వెంటనే రోగి పేరు, వయసు, ఆభా సంఖ్య, చిరునామా వంటి వివరాలు కనిపిస్తాయి. దేశంలోని ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందేందుకు 14 అంకెల ఆభా సంఖ్యను ఉపయోగించేలా ఈ వ్యవస్థ రూపొందించారు. దీంతో ఎక్కడి నుంచైనా ఆరోగ్య సేవలు పొందేందుకు ప్రజలకు సౌలభ్యం కలుగుతుంది.