OpenAI: చాట్‌జీపీటీ సంస్థలో తెలుగు నిపుణుడికి అత్యున్నత పదవి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధనా సంస్థ ఓపెన్‌ఏఐలో తెలుగు నిపుణుడు ఉదయ్ రుద్దర్రాజు కీలక బాధ్యతలు చేపట్టారు. సంస్థ కంప్యూట్ విభాగానికి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీఓ)గా ఆయన పదోన్నతి పొందారు. ఏడాది క్రితం సీనియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీడర్‌గా ఓపెన్‌ఏఐలో చేరిన ఉదయ్, తన ప్రతిభతో అత్యున్నత సాంకేతిక పదవిని దక్కించుకున్నారు. గతంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఉదయ్, అక్కడి నుంచి వైదొలిగి ఓపెన్‌ఏఐలో చేరారు. తాజాగా కంప్యూట్ విభాగ సీటీఓగా నియమితులైన విషయాన్ని ఆయన లింక్డ్‌ఇన్ వేదికగా వెల్లడించారు.
వివరాలు
విశ్వసనీయమైన కంప్యూటింగ్ వసతులను అందించడం లక్ష్యం
ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ.. ఓపెన్‌ఏఐ కంప్యూట్ బృందం జీపీటీ 5.6 వంటి అత్యాధునిక ఏఐ మోడళ్లకు అవసరమైన మెషీన్ లెర్నింగ్ శిక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
అధిక సామర్థ్యంతో పాటు వేగవంతమైన, విశ్వసనీయమైన కంప్యూటింగ్ వసతులను అందించడంపై తమ బృందం దృష్టి సారించిందన్నారు.
ప్రపంచంలోనే అత్యంత భారీ కంప్యూట్ మౌలిక సదుపాయాలను నిర్మించడమే తమ లక్ష్యమని వివరించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ అవసరాల కోసం ఉపయోగిస్తున్న చాట్‌జీపీటీ, మైక్రోసాఫ్ట్ మద్దతుతో పనిచేస్తున్న ఓపెన్‌ఏఐ రూపొందించిన ప్రముఖ ఏఐ చాట్‌బాట్ కావడం విశేషం.
వివరాలు
ఉదయ్ విద్యాభ్యాసం, కెరీర్
లింక్డ్‌ఇన్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం..ఉదయ్ రుద్దర్రాజు హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.
విద్యార్థి దశలోనే అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS)లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం దక్కించుకున్నారు.
అనంతరం అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తిచేశారు.
2012 నుంచి 2018 వరకు ఈబేలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, అనంతరం 2024 వరకు రాబిన్‌హుడ్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు.
తర్వాత ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ విభాగ అధిపతిగా సుమారు ఏడాది పాటు సేవలందించారు.
ఆ తర్వాత 2025 జులైలో ఓపెన్‌ఏఐలో సీనియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీడర్‌గా చేరి,ఇప్పుడు కంప్యూట్ విభాగ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు.