OpenAI: ఓపెన్‌ఏఐ నుంచి త్వరలో మూడు రకాల ఏఐ ఏజెంట్లు.. నెలకు సబ్‌స్క్రిప్షన్ ₹17 లక్షలు!
ఈ వార్తాకథనం ఏంటి
చాట్‌జీపీటీ మాతృసంస్థ,ఓపెన్‌ఏఐ (OpenAI) త్వరలో మరిన్ని అధునాతన ఏఐ ఏజెంట్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే కొన్ని ఏఐ ఏజెంట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ సంస్థ, ఇప్పుడు కొత్త తరహా ఏఐ ఏజెంట్లను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
అయితే, గతంలో అందుబాటులో ఉన్న సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లకు భిన్నంగా, ఈ కొత్త ఏఐ ఏజెంట్లను ప్రధానంగా కంపెనీల కోసం ప్రత్యేక రేట్లతో అందించనున్నట్లు సమాచారం.
ప్రత్యేక నైపుణ్యంతో కూడిన ఈ ఏఐ ఏజెంట్లను ఉపయోగించాలంటే, ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.
వివరాలు
సాఫ్ట్‌వేర్ డెవలపర్ మాదిరిగా పని చేసే రెండో రకం ఏఐ ఏజెంట్
ఓపెన్‌ఏఐ మూడు విభిన్న రకాల ఏఐ ఏజెంట్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
వీటిలో మొదటి ఏఐ ఏజెంట్ సంస్థలో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తుంది. ఇది సంబంధిత రంగంలో లోతైన జ్ఞానం కలిగి ఉండటమే కాకుండా, విమర్శనాత్మక ఆలోచన, వ్యూహాత్మక ప్రణాళిక, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ ఏజెంట్ సేవల ఖర్చు నెలకు సుమారు రూ.1.74 లక్షలు ఉంటుందని అంచనా.
ఇక రెండో రకం ఏఐ ఏజెంట్ ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ మాదిరిగా పని చేస్తుంది. ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉంది.
దీని సేవల ఖర్చు నెలకు రూ.8.7 లక్షలు ఉండనుంది.ఇది ముఖ్యంగా కోడింగ్, డీబగ్గింగ్, బగ్ ఫిక్సింగ్, కోడ్ డెవలప్‌మెంట్ వంటి పనులను నిర్వహించగలదు.
వివరాలు
మూడో రకం ఏఐ ఏజెంట్.. సేవలకు నెలకు 20,000 డాలర్లు
అయితే, ఇదే సామర్థ్యంతో ఇప్పటికే అమెరికాకు చెందిన టెక్ సంస్థ కాగ్నిషన్ అభివృద్ధి చేసిన ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 'డెవిన్' సబ్‌స్క్రిప్షన్ ధర రూ.45,500 మాత్రమే.
మూడో రకం ఏఐ ఏజెంట్ అత్యంత ప్రతిభావంతమైనదిగా ఉండనుంది.
ఇది పీహెచ్‌డీ స్థాయిలో పరిశోధనలు చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని సేవలకు నెలకు 20,000 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.17 లక్షలు) ఖర్చు అవుతుందని సమాచారం.
వివరాలు
నెలకు రూ.1950 చెల్లించి జెమినీ అడ్వాన్స్‌డ్ ప్లాన్
ఇదిలా ఉంటే, గూగుల్ కూడా తన జెమినీ డీప్ రీసెర్చ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇది వివిధ అంశాలను లోతుగా విశ్లేషించి సమగ్ర నివేదికలు రూపొందించగలదు.
నెలకు రూ.1950 చెల్లించి జెమినీ అడ్వాన్స్‌డ్ ప్లాన్‌ను వినియోగించే వినియోగదారులకు ఈ సేవ లభిస్తుంది.
అయితే, దీని ధరతో పోలిస్తే ఓపెన్‌ఏఐ ఏజెంట్లు చాలా ఖరీదైనవిగా ఉండనున్నాయి.
కానీ, ఈ ఏఐ ఏజెంట్లు మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే అంశంపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.