OpenAI: ఆండ్రాయిడ్‌లో ఓపెన్‌ఎఐ వీడియో యాప్ 'సోరా'
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధస్సుతో వీడియోలు రూపొందించే ప్రముఖ యాప్ 'సోరా' ఇప్పుడు ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన విధంగా వ్యక్తిగత వీడియోలను సృష్టించి, ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. సోరా మొదట గత సెప్టెంబర్‌లో ఐఫోన్ (iOS) కోసం విడుదలైంది. కాగా ఆ యాప్ ఐదు రోజుల్లోనే లక్షల్లో డౌన్‌లోడ్లు సాధించడంతో పెద్ద హిట్‌గా నిలిచింది. తాజా అప్‌డేట్‌తో ఇది అమెరికా, కెనడా, జపాన్, కొరియా, తైవాన్, థాయ్‌లాండ్, వియత్నామ్ దేశాల్లో గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది.
వివాదాలు
సోరా చుట్టూ వివాదాలు కూడా
టిక్‌టాక్‌లాగే సోరా యాప్‌లో కూడా AI ద్వారా సృష్టించిన వీడియోల ఫీడ్ కనిపిస్తుంది. అలాగే 'కేమియో' అనే ఫీచర్‌తో యూజర్లు తమకో, స్నేహితులకో సంబంధించిన వీడియోలని క్రియేట్ చేసుకోవచ్చు. అయితే దీని వల్ల డీప్‌ఫేక్‌లు, కాపీరైట్ అంశాలు ప్రభావితం అవుతాయన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో రైట్స్ హోల్డర్లను రక్షించేందుకు ఓపెన్‌ఎఐ కొన్ని విధానాలను మార్చాల్సి వచ్చింది.
ఫీచర్
'క్యారెక్టర్ కేమియోస్' అనే కొత్త ఫీచర్
ఆండ్రాయిడ్ విడుదలతో పాటు, 'క్యారెక్టర్ కేమియోస్' అనే కొత్త ఫీచర్‌ను కూడా సోరాలో అందుబాటులోకి తీసుకుని వచ్చింది ఓపెన్‌ఎఐ. దీని ద్వారా కొన్ని ప్రసిద్ధ పాత్రలు లేదా వ్యక్తులను ఆధారంగా చేసుకుని పునర్వినియోగించుకునే అవతార్లను యాప్‌లో ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో ఇవి ఉపయోగించేందుకు రైట్స్ హోల్డర్లు ప్రత్యేక చార్జ్ కూడా పెట్టుకునే అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. దీంతో కంటెంట్ సృష్టికర్తలకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంజన్
సోరా 2 AI వీడియో ఇంజన్
సోరా యాప్‌లో 'Sora 2' అనే ప్రత్యేక AI వీడియో ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది డైలాగ్‌లు, శబ్దం, కదలికలు, నిజ జీవితంలోని సహజ లక్షణాలను మరింత రియలిస్టిక్‌గా చూపిస్తుంది. అలాగే క్లిష్టమైన సూచనలను కూడా అర్థం చేసుకుని వాటిని వీడియోలలో ప్రతిబింబించే సామర్థ్యం ఉంది. ఈ టెక్నాలజీ గూగుల్ Veo 3 మోడల్‌కు పోటీగా నిలుస్తోంది.