
Open AI: కేన్సర్ సహా తీవ్రమైన వ్యాధులను గుర్తించగల GPT-5: ఓపెన్‌ఏఐ కొత్త ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఓపెన్‌ఏఐ తాజాగా విడుదల చేసిన GPT-5 మోడల్ ఆరోగ్య రంగంలో కొత్త అవకాశాలను చూపిస్తోంది. చాట్‌జీపీటీ (ChatGPT)ని ఇప్పటికే చాలా మంది సాధారణ వైద్య సలహాల కోసం ఉపయోగించినా,GPT-5 దాన్ని ఒక మెట్టు ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడు,మీరు టైప్ చేసే వివరాల ఆధారంగా,కేన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కూడా గుర్తించగలుగుతోందని కంపెనీ చెబుతోంది. తాజాగా నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో,దీనిని ప్రత్యక్ష ప్రసారంలో ప్రదర్శించిన ఓపెన్‌ఏఐ, GPT-5లో ఆరోగ్య విభాగం అత్యంత ఉపయోగకరమైన మార్పులలో ఒకటని హైలైట్ చేసింది. అంతర్గత ఆరోగ్య పరీక్షల్లో,గత మోడల్స్ కంటే GPT-5 అత్యధిక స్కోరు సాధించింది. 250కి పైగా వైద్య నిపుణుల సూచనలతో రూపొందించిన ఈ పరీక్షల్లో, నిజజీవిత ఆరోగ్య సంబంధిత పనులను మోడల్‌తో పరిశీలించారు.
వివరాలు
అందరి దృష్టిని ఆకర్షించిన నిజ జీవిత ఘటన
ప్రదర్శనలో ఒక నిజ జీవిత ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. 'కరోలినా' అనే మహిళ, ఒకే వారంలో మూడు రకాల కేన్సర్ బారిన పడ్డారని తేలింది. ఆ సమయంలో తీవ్ర ఆందోళనతో ఆమె తన బయాప్సీ రిపోర్ట్‌ను, అందులో ఉన్న క్లిష్టమైన వైద్య పదజాలాన్ని, చాట్‌జిపిటిలో పెట్టింది. కేవలం కొన్ని సెకండ్లలో, అది రిపోర్ట్‌ను సులభమైన భాషలో అర్థమయ్యేలా మార్చింది. దీంతో ఆమె ఆందోళన తగ్గి, పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది. "ఆ క్షణం చాలా ముఖ్యమైనది" అని కరోలినా చెప్పింది. "మూడుగంటల తరువాత వైద్యుడిని కలిసే సమయానికి, నేను ఎదుర్కొంటున్న పరిస్థితి గురించి ప్రాథమిక అవగాహన కలిగింది" అని ఆమె తెలిపింది.
వివరాలు
సాధారణ సెర్చ్ ఇంజిన్‌లా కాకుండా,ఆలోచనాత్మక భాగస్వామిలా..
తన చికిత్స కాలమంతా, కరోలినా GPT-5ని ఉపయోగించి క్లిష్టమైన చికిత్స ఎంపికలను అర్థం చేసుకోవడం, ప్రమాదాలను అంచనా వేయడం, వైద్యులను అడగాల్సిన ప్రశ్నలను సిద్ధం చేసుకోవడం వంటి పనులు చేసింది. ఒక కీలక నిర్ణయంలో.. డాక్టర్లు కూడా విభిన్న అభిప్రాయాలు చెప్పిన రేడియేషన్ చికిత్స చేయించుకోవాలా లేదా అన్న సందిగ్ధంలో.. GPT-5 ఆమెకు లాభనష్టాలను మరింత లోతుగా, వ్యక్తిగతంగా అర్థం చేసుకునేలా చేసింది. ఓపెన్‌ఏఐ ప్రకారం, GPT-5 ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం వివరాలను చెప్పడమే కాదు,పరిస్థితి నేపథ్యంలో భావాన్ని పట్టుకోవడం,సంబంధాలను కలపడం,తదుపరి దశల గురించి సూచనలు ఇవ్వడం వంటివి చేయగలగడం. ఇది సాధారణ సెర్చ్ ఇంజిన్‌లా కాకుండా,ఆలోచనాత్మక భాగస్వామిలా వ్యవహరిస్తుంది.
వివరాలు
GPT-5 వైద్య పరికరం కాదు
రిపోర్ట్‌లో లేని అంశాలను గుర్తించడం, లోటుపాట్లను చెప్పడం వంటి పనులు చేయగలదు. ఈ కారణంగా, "ఇది నన్ను నా ఆరోగ్య సంరక్షణలో చురుకైన భాగస్వామిగా మార్చింది" అని కరోలినా పేర్కొంది. అయితే, GPT-5 వైద్య పరికరం కాదు, వైద్యుల స్థానంలో పనిచేయదు. కానీ, ఆరోగ్య అవగాహన పెంచడానికి, రోగులకు సహాయం చేయడానికి ఇది ఒక శక్తివంతమైన కొత్త సాధనంగా నిరూపించుకుంటోంది.