OpenAI: ఏఐ రంగంలో ఓపెన్‌ఏఐ కీలక ముందడుగు.. రీసెర్చ్ ఇంటర్న్ రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో మరో కీలక ముందడుగు వేసినట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించింది. 'ఆటోమేటెడ్ రీసెర్చ్ ఇంటర్న్'ను విజయవంతంగా అభివృద్ధి చేసినట్లు వెల్లడించింది. అధునాతన ఏఐని రూపొందించే లక్ష్యంలో ఇది ముఖ్యమైన మైలురాయిగా పేర్కొంది. మనిషి సూచనలతో నిర్దిష్ట పరిశోధన పనులను ఈ వ్యవస్థ చేయగలదని తెలిపింది. సాధారణంగా నైపుణ్యం ఉన్న పరిశోధకుడికి కొన్ని రోజులు పట్టే పనులను కూడా ఇది సమర్థంగా పూర్తి చేయగలదని పేర్కొంది. 2028 మార్చి నాటికి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ ఏఐ పరిశోధకుడిని రూపొందించే దిశగా గణనీయమైన పురోగతి సాధిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
వివరాలు
ఏఐ పరిశోధకుడి లక్ష్యానికి గడువు
ఈ ఆటోమేటెడ్ రీసెర్చ్ ఇంటర్న్‌ను అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ తొలిసారిగా 2025 అక్టోబర్‌లో నిర్వహించిన లైవ్‌స్ట్రీమ్‌లో వెల్లడించారు.
వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఇంటర్న్ స్థాయి ఏఐ రీసెర్చ్ అసిస్టెంట్‌ను, 2028 మార్చి నాటికి నిజమైన ఏఐ పరిశోధకుడిని రూపొందించడం సాధ్యమేనని అప్పట్లో ఆయన చెప్పారు.
తమ పరిశోధన కార్యక్రమంలో ఈ లక్ష్యాలు అత్యంత కీలకమైనవని కూడా ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు.
వివరాలు
ఏఐ ఏజెంట్లతో సమస్యలు.. జర్మన్ వెబ్‌సైట్ హైజాక్
ఆటోమేటెడ్ రీసెర్చ్ ఇంటర్న్‌ను ప్రకటించిన కొద్ది రోజులకే ఓపెన్‌ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్లు అదుపు తప్పిన ఘటన వెలుగులోకి వచ్చింది.
జర్మనీకి చెందిన ఓ వెబ్‌సైట్‌ను ఏఐ ఏజెంట్లు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సమాచారం. ఇలాంటి ఘటన ఓపెన్‌ఏఐకి ఇదే తొలిసారి కాదు.
గతంలోనూ నియంత్రిత పరీక్షా వాతావరణం నుంచి ఏఐ మోడళ్లు బయటకు వెళ్లి హగ్గింగ్ ఫేస్‌లోకి చొరబడిన ఘటనను కంపెనీ ఎదుర్కొంది.
ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, ఏఐ పరిశోధన లక్ష్యాల సాధనలో ఓపెన్‌ఏఐ ముందుకు సాగుతోంది.