Social Media: 30 నిమిషాలకు పైగా ఇన్‌స్టాగ్రామ్,స్నాప్‌చాట్ వాడకంతో పిల్లల్లో తగ్గుతున్న ఏకాగ్రత : అధ్యయనం
ఈ వార్తాకథనం ఏంటి
రోజుకు అరగంటకు మించి ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో సమయం గడిపే పిల్లల్లో మెల్లమెల్లగా ఏకాగ్రత తగ్గిపోతున్నట్లు తాజాగా జరిగిన ఓ విస్తృత అధ్యయనం వెల్లడించింది. నాలుగు సంవత్సరాలపాటు సుమారు 8 వేల మందికి పైగా చిన్నారులను గమనిస్తూ చేసిన ఈ పరిశోధనలో అనేక ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. స్వీడన్‌కు చెందిన కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్, అమెరికాలోని ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. 9 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్న 8,324 మంది పిల్లల స్క్రీన్ వినియోగ అలవాట్లను పరిశీలించారు.
వివరాలు
టీవీ, వీడియో గేమ్స్‌తో ఈ సమస్య లేదని పరిశోధకుల వెల్లడి
అధ్యయనం వివరాల ప్రకారం, 9 ఏళ్ల వయసులో పిల్లలు రోజుకు సగటున 30 నిమిషాలు మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగించగా, 13 ఏళ్లకు వచ్చేసరికి అదే వినియోగం రోజుకు దాదాపు రెండున్నర గంటలకు చేరుకుంది. చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు 13 ఏళ్లను కనీస అర్హత వయసుగా నిర్ణయించినా, పిల్లల వినియోగం మాత్రం మరింత చిన్న వయసులోనే ప్రారంభమవుతోందని పరిశోధకులు గుర్తించారు. అదే సమయంలో టీవీ చూడటం లేదా వీడియో గేమ్స్ ఆడటం వంటివి పిల్లల ఏకాగ్రతపై గణనీయమైన ప్రతికూల ప్రభావం చూపలేదని అధ్యయనం స్పష్టంచేసింది. అయితే, కేవలం సోషల్ మీడియా వినియోగం మాత్రమే పిల్లల దృష్టి కేంద్రీకరణ సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్లు తేలిందని పరిశోధకులు తెలిపారు.
వివరాలు
నిరంతర నోటిఫికేషన్లే ఏకాగ్రత తగ్గడానికి ప్రధాన కారణం
ఈ పరిశోధనా బృందంలో ఉన్న ప్రొఫెసర్ టోర్కెల్ క్లింగ్‌బర్గ్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వరుసగా వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్‌లు, అలర్ట్‌లు పిల్లల దృష్టిని చెదరగొడుతున్నాయని చెప్పారు. ఏదైనా మెసేజ్ వచ్చిందేమోనన్న ఆలోచన ఉండడం కూడా పిల్లలు చేసే పనిపై పూర్తి దృష్టిని నిలుపుకోనీయకపోతోందని వివరించారు. పిల్లల సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, వారికి జన్యుపరంగా ఏడీహెచ్‌డీ లక్షణాలున్నాయా లేదా అన్నదానితో సంబంధం లేకుండానే ఈ ప్రతికూల ప్రభావం అందరిలోనూ కనిపిస్తోందని వెల్లడించారు.
వివరాలు
'పీడియాట్రిక్స్ ఓపెన్ సైన్స్' జర్నల్‌లో పూర్తి వివరాలు
ముందుగానే ఏకాగ్రత లోపంతో బాధపడే పిల్లలే సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారని కాదు, సోషల్ మీడియా అధిక వినియోగమే పిల్లల్లో ఏకాగ్రత లోపానికి కారణమవుతోందన్న విషయం ఈ అధ్యయనంతో స్పష్టమైంది. ఒక్కో పిల్లపై ఈ ప్రభావం స్వల్పంగా కనిపించినప్పటికీ, సమూహ స్థాయిలో చూస్తే ఇది మొత్తం సమాజంపై గణనీయమైన ప్రభావం చూపే సమస్యగా మారవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు 'పీడియాట్రిక్స్ ఓపెన్ సైన్స్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.