
V Narayanan: గగన్‌యాన్‌కు ఇప్పటివరకు 7200 పరీక్షలు పూర్తి: ఇస్రో చీఫ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు.
ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులో భాగంగా 7,200కు పైగా పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని, ఇంకా సుమారు 3,000 పరీక్షలు మిగిలి ఉన్నాయని ఆయన తెలిపారు.
కోల్‌కతాలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2025 సంవత్సరాన్ని 'గగన్‌యాన్ సంవత్సరం'గా ప్రకటించినట్లు చెప్పారు.
ఈ సంవత్సరం సంస్థకు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉందని పేర్కొన్నారు.
వివరాలు
మానవసహిత అంతరిక్ష యాత్ర లక్ష్యం
మానవులను అంతరిక్షంలోకి పంపే మిషన్‌కు ముందు మూడు మానవరహిత ప్రయోగాలను నిర్వహించేందుకు ఇస్రో ముందుగానే ప్రణాళిక రూపొందించిందని నారాయణన్ వెల్లడించారు.
ఈ క్రమంలో మొదటి మానవరహిత ప్రయోగాన్ని ఈ ఏడాదిలోనే చేపట్టనున్నట్లు చెప్పారు.
"ఈ సంవత్సరం మాకు అత్యంత కీలకమైనది. గగన్‌యాన్ సంవత్సరం అని అధికారికంగా ప్రకటించాం. మానవ అంతరిక్షయాత్రకు ముందు మేము మూడు మానవరహిత ప్రయోగాలు చేయాలని నిర్ణయించాం. అందులో మొదటిదాన్ని ఈ సంవత్సరంలోనే నిర్వహించబోతున్నాం. ఇప్పటివరకు 7,200 పరీక్షలు పూర్తయ్యాయి. మరో 3,000 మిగిలి ఉన్నాయి. రోజూ 24 గంటలూ పని కొనసాగుతోంది," అని వివరించారు.
వివరాలు
గగన్‌యాన్ ప్రాజెక్టుకు కేంద్రం డిసెంబర్ 2018లో ఆమోదం
ఇస్రో ఈ ఏడాది సాధించిన ఘనతలను కూడా ఆయన ప్రస్తావించారు.
"మీకు తెలిసిందే, ఈ సంవత్సరం మేము ఎంతో మంది గర్వపడే విజయాలను అందుకున్నాం. జనవరి 6న ఆదిత్య ఎల్1 ఉపగ్రహం సేకరించిన ఏడాది పాటు శాస్త్రీయ డేటాను విడుదల చేశాం. ఆదిత్య ఎల్1 విశిష్టత ఏమిటంటే.. సూర్యుడి అధ్యయనానికి ఉపగ్రహాన్ని పంపిన నాలుగు దేశాల్లో భారత్ కూడా ఒకటి," అని అన్నారు.
"జనవరి 16న మరో కీలకమైన, గొప్ప విజయాన్ని కూడా నమోదు చేశాం," అని ఆయన ఐఏఎన్ఎస్‌కు తెలిపారు.
గగన్‌యాన్ ప్రాజెక్టుకు కేంద్రం డిసెంబర్ 2018లో ఆమోదం మంజూరు చేసింది.
వివరాలు
స్పేస్‌డెక్స్ ప్రయోగం విజయవంతం, ఇంధన ఆదా
ఈ కార్యక్రమం ద్వారా తక్కువ భూమి కక్ష్యలో మానవసహిత యాత్ర నిర్వహించడం,దీర్ఘకాలికంగా మానవ అంతరిక్షయాత్రలకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి.
ఇటీవల స్పాడెక్స్ (SpaDeX) మిషన్ విజయవంతంగా పూర్తి కావడంపై నారాయణన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
"ఈ మిషన్ కోసం మేము పదికిలోల ఇంధనం కేటాయించాం.అయితే కేవలం సగం ఇంధనంతోనే ఈ ప్రయోగాన్ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం.మిగతా ఇంధనం ఇంకా అందుబాటులో ఉంది. వచ్చే నెలల్లో మేము అనేక ప్రయోగాలను చేపట్టబోతున్నాం. వాటి గురించి త్వరలోనే మీకు తెలుసుతాయి," అని చెప్పారు.
వివరాలు
ఈ ఏడాది చివరికల్లా 'వ్యోమమిత్ర'
ఈ సంవత్సరం డిసెంబరులో 'వ్యోమమిత్ర' అనే రోబో సహాయంతో తొలి మానవరహిత ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.
అనంతరం మరో రెండు మానవరహిత ప్రయోగాలు కూడా చేపట్టనున్నట్టు చెప్పారు.
ఇక 2027 తొలి త్రైమాసికంలో తొలి మానవసహిత అంతరిక్షయాత్రను నిర్వహించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టు స్పష్టం చేశారు.
"ఈ సంవత్సరం దాదాపు ప్రతి నెలా ఒక ప్రయోగం షెడ్యూల్‌లో ఉంది," అని నారాయణన్ తెలిపారు.