Pegasus: పెగాసస్ వివాదం.. అమెరికా తీర్పుతో మెటాకు ఊరట.. ఎన్‌ఎస్‌ఓకు ఎదురుదెబ్బ
వాట్సాప్ వినియోగదారుల డివైజ్‌లలో అక్రమంగా పెగాసస్ స్పైవేర్‌ను చొప్పించిందనే ఆరోపణలపై ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌కు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మెటా దాఖలు చేసిన కేసులో 1400 మంది వాట్సాప్ వినియోగదారుల డివైజ్‌లను హ్యాక్ చేయడంలో ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ బాధ్యత వహించాల్సిందేనని న్యాయమూర్తి ఫిల్లిస్ హమిల్టన్ తీర్పు ఇచ్చారు. 2019లో మెటా సంస్థ ఈ కేసును కోర్టులో దాఖలు చేసింది. వాట్సాప్‌లోని బగ్‌ను ఉపయోగించి, వినియోగదారుల డివైజ్‌లలో పెగాసస్ స్పైవేర్‌ను చొప్పించిందని మెటా ఆరోపించింది. కోర్టు విచారణలో ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ సంబంధిత చట్టాలను ఉల్లంఘించిందని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును మెటా సంస్థ స్వాగతించగా, ఎన్‌ఎస్‌ఓ గ్రూప్ స్పందన ఇవ్వలేదు.
ఆధారాలు లేవని గతంలో చెప్పిన ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్
పెగాసస్ స్పైవేర్ ప్రభావం భారత్‌లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. 2021లో 300 భారతీయ మొబైల్ నెంబర్లను పెగాసస్ ద్వారా టార్గెట్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఇందులో కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, వ్యాపారులు ఉన్నారని ఆరోపణలు వినిపించాయి. అయితే ఈ ఆరోపణలను అప్పటి ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఖండిస్తూ, వాటికి ఆధారాలు లేవని పార్లమెంటులో ప్రకటించారు. అమెరికా కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో పెగాసస్ వివాదం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. భారతీయ ప్రజలు ఈ తీర్పును ఆసక్తిగా గమనిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం హేతుబద్ధంగా వాడాల్సిన అవసరం ఉండగా, పెగాసస్ వంటి వ్యవస్థల దుర్వినియోగం వినియోగదారుల గోప్యతకు ముప్పుగా మారుతోంది.