LOADING...
Phone lost or stolen: మీ ఫోన్ పోయిందా.. అయితే వెంటనే ఏం చేయాలంటే..?
మీ ఫోన్ పోయిందా.. అయితే వెంటనే ఏం చేయాలంటే..?

Phone lost or stolen: మీ ఫోన్ పోయిందా.. అయితే వెంటనే ఏం చేయాలంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫోన్ చోరీకి అయిన వెంటనే ఎవరైనా షాక్‌కు గురవ్వడం కామన్. చాలామందికి కొద్దిసేపు వరకు అసలు మైండే పనిచేయదు. ఎందుకంటే అందులో మన వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకింగ్ వివరాల వరకు అన్నీ ఉంటాయి. అయితే ఆ గందరగోళంలో ఆలస్యం జరిగితే మాత్రం మీ ఖాతాలోని డబ్బు మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మొబైల్ పోయిన వెంటనే తీసుకోవాల్సిన కీలక చర్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వివరాలు 

ఆర్థిక రక్షణే మొదటి ప్రాధాన్యత

ఫోన్‌లో లాక్ ఉన్నా కూడా సైబర్ నేరగాళ్లు దాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. అందుకే వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి మొబైల్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేయించాలి. UPI లావాదేవీలు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులకు సంబంధించిన టోకనైజేషన్ సర్వీసులను కూడా తక్షణమే బ్లాక్ చేయమని కోరాలి. అదే సమయంలో మీ టెలికాం కంపెనీకి కాల్ చేసి సిమ్ కార్డ్‌ను డిసేబుల్ చేయించుకోవడం అత్యంత కీలకం. ఎందుకంటే అన్ని OTPలు సిమ్‌కే వస్తాయి. దొంగకు సిమ్ యాక్సెస్ లభిస్తే పాస్‌వర్డ్‌లను సులభంగా మార్చే ప్రమాదం ఉంటుంది.

వివరాలు 

డిజిటల్ పాస్‌వర్డ్స్ మార్చండి

బ్యాంకింగ్ వ్యవహారాలు సురక్షితంగా అయ్యాక, మిగతా డిజిటల్ అకౌంట్లపై దృష్టి పెట్టాలి. మరో ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి ముందుగా మీ ప్రధాన ఇమెయిల్ అకౌంట్ పాస్‌వర్డ్ మార్చండి. ఇది ఇతర అన్ని అకౌంట్ల రికవరీకి ఆధారం కాబట్టి దీన్ని మరింత సేఫ్‌గా ఉంచుకోవాలి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ డ్రైవ్ వంటి యాప్స్‌లో రిమోట్ లాగ్‌అవుట్ ఆప్షన్ ఉపయోగించి మీ అకౌంట్లను బయట నుంచి యాక్సెస్ చేయకుండా చూడాలి.

Advertisement

వివరాలు 

పోలీసు ఫిర్యాదు - CEIR పోర్టల్

ఫోన్ తిరిగి దొరుకుతుందనే ఆశ ఉన్నా లేకపోయినా పోలీస్ కంప్లైంట్ తప్పనిసరి. ఆన్‌లైన్ ద్వారా లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి రసీదు తీసుకోవాలి. ఇది భవిష్యత్తులో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి, డూప్లికేట్ సిమ్ తీసుకోవడానికి అవసరం అవుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే CEIR పోర్టల్‌లో మీ మొబైల్ IMEI నంబర్‌ను నమోదు చేయాలి. దీని వల్ల ఆ ఫోన్ ఏ నెట్‌వర్క్‌లోనూ పనిచేయకుండా పూర్తిగా బ్లాక్ అవుతుంది.

Advertisement

వివరాలు 

పర్సనల్ డేటా విషయంలో జాగ్రత్త

మీ ఫోన్‌లో ఆధార్,పాన్ కార్డు,పాస్‌పోర్ట్ వంటి డాక్యుమెంట్ల కాపీలు ఉంటే,రాబోయే కొన్ని వారాల పాటు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్లను నిరంతరం చెక్ చేయాలి. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇవ్వాలి.ఆఫీస్ మెయిల్స్ లేదా అధికారిక డేటా ఫోన్‌లో ఉంటే,వెంటనే మీ కంపెనీ ఐటీ విభాగానికి తెలియజేయడం కూడా అవసరం. ఏం చేయకూడదు? మీఫోన్ దొరికిందని చెబుతూ ఎవరు పంపే అనుమానాస్పద ట్రాకింగ్ లింక్స్‌పై క్లిక్ చేయకండి. లాగిన్ ఐడీ,పాస్‌వర్డ్ వివరాలు ఎంటర్ చేయడం వల్ల అవి ఫిషింగ్ లింక్స్‌గా మారి మీడేటా మొత్తం దొంగిలించే అవకాశం ఉంటుంది. 'కొంచెం వెతికి చూద్దాం'అని భావించి బ్యాంక్ అకౌంట్లను బ్లాక్ చేయడంలో ఆలస్యం చేస్తే భారీ నష్టం కలిగే ప్రమాదం ఉంది.

వివరాలు 

ముందస్తు జాగ్రత్తలు చాలా ముఖ్యం

మీ ఫోన్ IMEI నంబర్‌ను ముందుగానే ఎక్కడైనా రాసి భద్రపరచుకోండి. ఫోన్ లాక్‌తో పాటు ప్రతి పేమెంట్ యాప్‌కు ప్రత్యేకంగా యాప్ లాక్ ఉపయోగించండి. అత్యవసర కాంటాక్ట్ నంబర్లను పేపర్‌పై రాసి వాలెట్‌లో ఉంచుకోవడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఫోన్ పోయినా మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ వ్యక్తిగత సమాచారం, కష్టపడి సంపాదించిన డబ్బు పోతే తిరిగి పొందడం అంత సులభం కాదు. కాబట్టి వేగంగా స్పందించడంతో పాటు, ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి.

Advertisement