Rare Kolar Roundleaf Bat: ఈ అరుదైన గబ్బిలానికి ఆకలెక్కువ.. 4,100కుపైగా కీటకాలే ఆహారం!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ అరుదైన గబ్బిలం కోలార్ రౌండ్‌లీఫ్ బ్యాట్. కర్ణాటకలోని కోలార్ జిల్లా హనుమనహళ్లి గుహలో మాత్రమే నివసించే ఈ జాతి ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అంతరించిపోతున్న గబ్బిలాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ గబ్బిలం 4,100కుపైగా కీటక జాతులను ఆహారంగా తీసుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ పరిశోధన ప్రకారం గబ్బిలాలు కేవలం రాత్రివేళల్లో సంచరించే జీవులు మాత్రమే కావని, ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషించే సహజ రక్షకులని తేలింది. ముఖ్యంగా వ్యవసాయానికి హానికరమైన తెగుళ్లను నియంత్రించడంతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలోనూ ఇవి విలువైన సేవలు అందిస్తున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.
వివరాలు
300 కంటే తక్కువగా అరుదైన గబ్బిలాల సంఖ్య
ప్రస్తుతం ప్రపంచంలో కోలార్ రౌండ్‌లీఫ్ బ్యాట్‌కు హనుమనహళ్లి గుహే ఏకైక నివాసంగా గుర్తించారు.
ఈ అరుదైన గబ్బిలాల సంఖ్య ప్రస్తుతం 300 కంటే తక్కువగా ఉందని అధ్యయనం వెల్లడించింది.
వీటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు అవసరమని పరిశోధకులు సూచించారు.
ఈ గబ్బిలాలు డెంగీ, మలేరియా వ్యాప్తికి కారణమయ్యే దోమలతో పాటు టొమాటో లీఫ్ మైనర్ వంటి వ్యవసాయ తెగుళ్లను కూడా ఆహారంగా తీసుకుంటూ, సహజంగా కీటకాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అధ్యయన ప్రధాన రచయిత్రి భార్గవి శ్రీనివాసులు తెలిపారు.
దీంతో రసాయనిక పురుగుమందుల అవసరాన్ని తగ్గించడంలో కూడా ఇవి పరోక్షంగా దోహదపడుతున్నాయని ఆమె వివరించారు.
వివరాలు
పరిశోధన ఫలితాలు ప్రతిష్ఠాత్మక జర్నల్ ఆఫ్ థ్రెటెంట్ టాక్స్‌లో ప్రచురితమయ్యాయి
ఈ పరిశోధనలో డాక్టర్ ఆదిత్య శ్రీనివాసులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైల్డ్‌లైఫ్ బయాలజీ అండ్ టాక్సానమీ ల్యాబ్ అధిపతి ఆచార్య చెల్మల శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు.
ఈ పరిశోధన ఫలితాలు అంతర్జాతీయ ప్రతిష్ఠాత్మక జర్నల్ ఆఫ్ థ్రెటెండ్ టాక్సాలో ప్రచురితమయ్యాయి.