జియో ఏయిర్ ఫైబర్: రిలయన్స్ జియో నుండి సరికొత్త ఇంటర్నెట్ సేవలు
మొబైల్ నెట్ వర్క్ మార్కెట్ ను ఏకఛత్రాధిపత్యంలా ఏలుతున్న రిలయన్స్ జియో, ఏయిర్ ఫైబర్ ని లాంచ్ చేసింది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 19న ఏయిర్ ఫైబర్ ని లాంచ్ చేశారు. గత నెల జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సంవత్సరాంతపు సమావేశంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, ఏయిర్ ఫైబర్ ని లాంచ్ తేదీని వెల్లడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాంచింగ్ కొనసాగుతోంది. 1.5 Gbps వరకు స్పీడుతో ఎలాంటి అవరోధాలు లేకుండా ఇంటర్నెట్ సేవలను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. వైర్ లేకుండా కేవలం ఏయిర్ ఫైబర్ సాధనం తెచ్చుకుని ఆన్ చేస్తే ఇంట్లో వైఫై సేవలు ఆన్ ఐపోతాయి. హై స్పీడ్ ఇంటర్నెట్ తో సౌకర్యంగా ఉండనుందని రిలయన్స్ జియో తెలియజేస్తుంది.
6వేల రూపాయలకు జియో ఏయిర్ ఫైబర్?
జియో ఏయిర్ ఫైబర్ ధర ఎక్కువగా ఉండనుందని సమాచారం. 6వేల రూపాయల వరకు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. వైర్ లెస్ డివైజ్ కాబట్టి ధర అధికంగా ఉండనుందని చెబుతున్నారు. ఆఫీసుల్లో గానీ, ఇంట్లో గానీ డైరెక్టుగా డివైజ్ తెచ్చుకుని కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. స్మార్ట్ ఫోన్స్, టీవీ, ట్యాబ్లెట్స్, సెట్ ఎ టాప్ బాక్స్, కంప్యూటర్, లాప్టాప్.. ఇలా అన్నిరకాల డివైజులకు అనుసంధానం చేసుకోవచ్చు. ప్రస్తుతం వైర్ కనెక్షన్ తో జియో ఫైబర్ అందుబాటులో ఉంది. దానికి అప్డేట్ వెర్షన్ లో వైర్ లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం జియో ఏయిర్ ఫైబర్ ని రిలయన్స్ జియో తీసుకొచ్చింది.