Russia: చంద్రునిపై అణు విద్యుత్ ప్లాంట్‌ను ప్లాన్ చేస్తున్న రష్యా
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రుడిపై అన్వేషణను మరింత విస్తరించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కీలక ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమైంది. రాబోయే పదేళ్లలో చంద్రుడిపై విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తోంది. తమ లూనార్ కార్యక్రమంతో పాటు రష్యా-చైనా సంయుక్త పరిశోధనా కేంద్రానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని రష్యా ప్రకటించింది.
వివరాలు
లావొచ్‌కిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఏరోస్పేస్ సంస్థ
2036 నాటికి చంద్రుడిపై విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ 'రోస్కోస్మోస్' వెల్లడించింది. ఈ దిశగా ఏరోస్పేస్ సంస్థ లావొచ్‌కిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. చంద్ర ఉపరితలంపై పనిచేసే రోవర్లు,పరిశీలనా కేంద్రాలు, రష్యా-చైనా సంయుక్త పరిశోధనా కేంద్రం, అలాగే తమ స్వంత లూనార్ ప్రోగ్రామ్‌కు అవసరమైన విద్యుత్‌ను అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని వివరించింది. అయితే ఇది అణు విద్యుత్ కేంద్రం కావచ్చన్న వార్తలు వెలువడుతున్నప్పటికీ, దీనిపై రష్యా సంస్థ నుంచి ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
వివరాలు
లూనా-25 మిషన్ చంద్రుడిపై ల్యాండింగ్‌కు ముందే విఫలం
అంతరిక్ష రంగంలో ఒకప్పుడు అగ్రస్థానంలో ఉన్న రష్యా 1961లోనే యూరి గగారిన్‌ను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించింది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే కొంత వెనుకబడినట్లు పరిశీలకులు చెబుతున్నారు. 2023 ఆగస్టులో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన లూనా-25 మిషన్ చంద్రుడిపై ల్యాండింగ్‌కు ముందే విఫలమవడం రష్యాకు నిరాశ కలిగించింది. ఇదిలా ఉండగా, అంతరిక్ష ప్రయోగాల్లో వేగంగా ముందుకెళ్తున్న ఎలాన్ మస్క్ సంస్థలు కూడా రష్యాకు గట్టి పోటీగా మారుతున్నాయి.