AI Safety Limits: ఏఐకి దూకుడుకు బ్రేకులు పడనున్నాయా? ఆల్ట్‌మన్ నిర్ణయం వెనుక కారణమేంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజురోజుకూ మరింత శక్తివంతంగా మారుతున్న వేళ, దాని వేగానికి కొంత బ్రేక్ వేయాలనే చర్చ మొదలైంది. ఓపెన్‌ఏఐ చీఫ్ సైంటిస్ట్ జకుబ్ పచోకీ శక్తివంతమైన ఏఐ మోడళ్ల అభివృద్ధికి పరిశ్రమ మొత్తం పాటించే సాధారణ పరిమితులు ఉండాలని ప్రతిపాదించారు. ఏఐ ప్రవర్తనను అర్థం చేసుకోవడం, పర్యవేక్షించడం వంటి భద్రతా సామర్థ్యాలు ఒక నిర్దిష్ట స్థాయికి చేరుకునే వరకు డెవలపర్లు ఆ పరిమితులను దాటకూడదన్నది ఆయన సూచన. ఈ ప్రతిపాదనకు ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ మద్దతు తెలిపారు.
Details
'పెర్ప్లెక్సిటీ'తో ఎలా నిర్ణయిస్తారు?
పచోకీ సూచించిన పరిమితుల్లో 'పెర్ప్లెక్సిటీ' అనే సాంకేతిక కొలమానం కూడా ఉండొచ్చు.
ఒక ఏఐ మోడల్ తర్వాత వచ్చే పదం లేదా సమాచారాన్ని ఎంత సమర్థంగా అంచనా వేయగలదో ఈ కొలమానం ద్వారా అర్థం చేసుకోవచ్చు.
అయితే ప్రస్తుతం ఏ స్థాయిని పరిమితిగా నిర్ణయించాలి, ఆ నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి రావాలి అనే విషయాలను పచోకీ స్పష్టంగా చెప్పలేదు.
ముఖ్యంగా 2027 నాటికి ఏఐ తన అభివృద్ధిని తానే మరింత వేగవంతం చేసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
అలా జరిగితే ఏఐను పర్యవేక్షించే మానవ సామర్థ్యాలు వెనుకబడే ప్రమాదం ఉందన్నది ఆయన ఆందోళన.
Details
ఆల్ట్‌మన్ ఎందుకు మద్దతిచ్చారు?
పచోకీ ప్రతిపాదనకు సామ్ ఆల్ట్‌మన్ మద్దతు ఇవ్వడం ఇప్పుడు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
శక్తివంతమైన ఏఐ మోడళ్లను రూపొందించే సంస్థలు కలిసి ఒకే విధమైన భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.
కొత్త మోడల్‌ను విడుదల చేసే సమయంలోనే దాని భద్రతను పరీక్షించేందుకు 'రెడ్ టీమింగ్' వంటి విధానాలను కూడా ఉమ్మడిగా పాటించాలని సూచించారు.
ఇప్పటికే ఏఐ భద్రత కోసం పరిశ్రమలో కొన్ని ఒప్పందాలు, ప్రమాణాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Details
ఏఐ వేగానికి నిజంగానే బ్రేకులు పడతాయా?
ఇది ఏఐ అభివృద్ధిని ఆపే నిర్ణయం కాదు. ప్రమాదకర స్థాయికి చేరుకునే ముందే దాని సామర్థ్యాలను అర్థం చేసుకునే వ్యవస్థలను బలోపేతం చేయాలన్న ఆలోచన.
ఏఐ మోడళ్లు మరింత శక్తివంతమవుతున్న కొద్దీ వాటి సామర్థ్యాలను పరీక్షించడం, తప్పులను గుర్తించడం, అనూహ్య ప్రవర్తనను పర్యవేక్షించడం కూడా కష్టమవుతోంది.
అందుకే ఒకే రకమైన భద్రతా ప్రమాణాలపై పరిశ్రమ ఏకాభిప్రాయానికి రావాలన్న డిమాండ్ పెరుగుతోంది.
ఈ చర్చలో ఆల్ట్‌మన్ మద్దతు ఇవ్వడం భవిష్యత్ ఏఐ అభివృద్ధిపై ప్రభావం చూపే కీలక పరిణామంగా మారింది.